నటుడు తారకరత్న బంధువులపై దాడి..

2 May, 2021 16:01 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌ : సినీ నటుడు నందమూరి తారకరత్న బంధువులపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి దాడి చేసి పరారైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2 లోని సాగర్‌ సొసైటీ ఫ్లాట్‌ నంబర్‌ 35లో విజయవాడకు చెందిన బెజవాడ బాలకృష్ణ(33) అనే తారకరత్న బంధువు అద్దెకుంటున్నాడు. శుక్రవారం ఉదయం తన సోదరుడు ఎం.కృష్ణాత్మ(45) అనే ఈవెంట్‌ మేనేజర్‌తో కలిసి టీ తాగుతున్నాడు. ఇదే సమయంలో నలుగురు ఆగంతకులు ఉదయం 10.30 గంటల ప్రాతంలో ఇంట్లోకి ప్రవేశించి వీరిద్దరి కళ్లల్లో కారం పొడి చల్లారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. కొద్దిసేపట్లోనే ఆ నలుగురు అక్కడి నుంచి కారులో పరారయ్యారు.

ఈ దాడిలో కృష్ణాత్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరికి తల, చేతులకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కోలుకున్న తర్వాత రాత్రి తారకరత్నలో కలిసి పోలీసులకు తమపై దాడి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారు 30 నుంచి 35 ఏళ్ల వయసు వారై ఉంటారని తెలిపారు. వారు తమపై ఎందుకు దాడి చేశారు, వారు ఎవరై ఉంటారన్న వివరాలు తెలియదని తెలిపారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు వచ్చిన కారు నంబర్‌ కోసం ఆరా తీస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్‌ 452, 324 కింద కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు