వివాదంలో శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’.. సినిమా రిలీజ్ ఆపేయాలి!

18 Aug, 2021 18:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి నటించిన ‘క్రేజీ అంకుల్స్‌’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలను నిలిపి వేయలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి.  సినిమా  ట్రైలర్‌లో మహిళలను కించపరిచేలా డైలాగులు ఉన్నాయని ఆరోపిస్తూ.. వాటిని వెంటనే తొలగించాలంటూ తెలంగాణ మహిళా ఐక్య వేదిక కార్యదర్శి రత్న డిమాండ్‌ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమాలో మహిళలను కించపరిచే విధంగా డైలాగులును పెట్టడం సరికాదన్నారు. 

భారతీయ కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే విధంగా సినిమాలు తీయడం విచారకరమని అన్నారు. మహిళల  పేరుతో హాస్యం సృష్టించడం దారుణమన్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే, మానవ సంబంధాలు చెడగొట్టే, భార్య భర్తల మధ్య సఖ్యత చెడగొట్టే సినిమాలను తీస్తే సహించమన్నారు. సమాజాన్ని నాశనం చేసే సినిమాలను వెంటనే నిలుపుదల చెయ్యాలని,  క్రేజీ అంకుల్స్ సినిమాలో  అభ్యంతరకర సంభాషణలను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడగొట్టకండి అని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖా అన్నారు. ఈనెల  9న సినిమా విడుదలను నిలిపి వేయాలని, లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. అభ్యంతరకర సినిమాలు తీసే వారికి సమాజంలో జీవించే హక్కు లేదన్నారు. కాగా యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ రేపు (ఆగష్టు19) విడుదల కానుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే విడుదలకు కేవలం ఒకరోజు ముందు ఇలా మహిళా సంఘాలు అడ్డుకోవడంతో చిత్రం రిలీజ్పై అనుమానాలు మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు