నా భర్త విడాకులకు నేను కారణం కాదు - హన్సిక

12 Feb, 2023 01:57 IST|Sakshi

గత ఏడాది డిసెంబరు 4న వ్యాపారవేత్త సోహైల్‌ కతురియా, హీరోయిన్‌ హన్సికల వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరి ప్రేమ, పెళ్లి గురించిన సంగతులతో ‘లవ్‌ షాదీ డ్రామా’ అనే వీడియో ఒకటి ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వీడియోలో హన్సిక పంచుకున్న విషయాల్లో సోహైల్‌ మొదటి పెళ్లి గురించిన అంశం ఒకటి. ‘‘సోహైల్, నా పెళ్లి గురించిన విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నాను. నేను సెలబ్రిటీని కావడం వల్ల కాబోలు అవన్నీ బహిర్గతం అయ్యాయి. సోహైల్‌ విడాకులు తీసుకోవడానికి నేనే కారణమని వార్తలు వచ్చాయి. సోహైల్‌ పెళ్లి (మొదటి పెళ్లి)లో నేను పాల్గొన్న ఫోటోలను షేర్‌ చేసి, కొందరు నన్ను విమర్శించారు కూడా.

నిజం చెప్పాలంటే సోహైల్‌ విడాకులకు నేను కారణం కాదు. నా భర్తకు గతంలో పెళ్లయిన విషయం నాకు తెలుసు. వారికి అధికారికంగా విడాకులు వచ్చాయి’’ అని చెప్పుకొచ్చారు హన్సిక. అలాగే ‘‘గతంలో నేనో రిలేషన్‌లో ఉన్నాను. ఈ విషయం అందరికీ తెలుసు. మళ్లీ అలాంటి  బంధాన్ని కొనసాగించాలని లేదు. అందుకే పెళ్లి చేసుకున్నాను. సోహైల్‌ నా జీవితంలోకి వచ్చిన క్షణాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇకపై నా భర్తతోనే నేను పబ్లిక్‌లోకి రావాలనుకుంటున్నాను’’ అని కూడా పేర్కొన్నారు హన్సిక.

ఇక తన మొదటి వివాహం విఫలం కావడానికి హన్సిక కారణం కాదని సోహైల్‌ కూడా పేర్కొన్నారు. 2014లో రింకీ బజాజ్‌ను పెళ్లాడారు సోహైల్‌. ‘‘ఆ వివాహ బంధం చాలా కొద్ది కాలం మాత్రమే సాగింది’’ అన్నారు సోహైల్‌. రింకీ, సోహైల్‌కి హన్సిక కామన్‌ ఫ్రెండ్‌ కావడంతో ఆ పెళ్లికి వెళ్లారామె. ఆ పెళ్లి వీడియోలో హన్సిక డ్యాన్స్‌ చేశారు కూడా. ఆ వీడియోను షేర్‌ చేసి, ఒక ఫ్రెండ్‌ వైవాహిక జీవితం ముగియడానికి కారణం హన్సిక అంటూ వచ్చిన వార్తలకు ‘లవ్‌ షాదీ డ్రామా’ ద్వారా స్పందించారు హన్సిక, సోహైల్‌.

మరిన్ని వార్తలు