‘మీకో దండం.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు’

26 Nov, 2020 19:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తను మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు వస్తున్న వదంతులను నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ కొట్టి పారేశారు. ఏ పార్టీలో చేరడం లేదని, రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగినట్లు స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా బండ్ల గణేష్‌ తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపించాయి. త్వరలోనే భారతీయ జనతా పార్టీలో(బీజేపీ) పార్టీలో చేరబోతున్నట్లు వదంతులు వ్యాపించాయి. కాగా ఈ రూమర్లను ఖండిస్తూ రెండు రోజుల క్రితం బండ్ల గణేష్‌ తన ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్’ అంటూ పేర్కొన్నారు. కాగా 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం తన పౌల్ట్రీ వ్యాపారాన్ని చూసుకుంటూ, సినిమాలపైన ఫోకస్‌ పెట్టారు. చదవండి: దయచేసి నా కడుపు మీద కొట్టకండి

అయితే ఎంత చెప్పినప్పటికీ బండ్ల గణేష్‌ రాజకీయ పునఃప్రవేశంపై పుకార్లు ఆగడం లేదు. కొందరు పనిగట్టుకుని మరీ బండ్ల గణేష్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఊరుకోండి సార్‌ మీరు ఇలాగే అంటారు. మరి కాసేపటికి మనుసు మార్చుకుంటారు. ఎన్నిసార్లు చూడలేదు’ అంటూ రచ్చ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అనేక మంది బీజేపీలోకి చేరుతున్నారని, బండ్ల గణేష్‌ కూడా త్వరలో కాషాయ కండువా కప్పుకోబుతున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రూమర్లపై మరోసారి స్పందించిన నిర్మాత.. ‘నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం.’ అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీ షేర్ చేశారు. మరి ఇప్పటికైనా ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి. చదవండి: అద్భుతమైన వార్త, బాస్ ఓకే : బండ్ల గణేష్

మరిన్ని వార్తలు