ఆ హీరోతో రొమాంటిక్‌ మూవీ చేయాలని ఉంది: సోనాల్‌ చౌహాన్‌

25 Sep, 2022 04:03 IST|Sakshi

– సోనాల్‌ చౌహాన్‌

‘‘యాక్షన్‌ మూవీ చేయాలనే నా ఆకాంక్ష ‘ది ఘోస్ట్‌’తో నెరవేరింది’’ అన్నారు సోనాల్‌ చౌహాన్‌. నాగార్జున, సోనాల్‌ చౌహాన్‌ జంటగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ ఆశీస్సులతో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 5న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా సోనాల్‌ చౌహాన్‌ చెప్పిన విశేషాలు...

► ప్రవీణ్‌ సత్తారు ‘ది ఘోస్ట్‌’ కథ చెప్పినపుడు థ్రిల్‌ అయ్యాను. ఈ చిత్రంలో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా చేశాను. ఇది సవాల్‌తో కూడుకున్న పాత్ర. అందుకే  శిక్షణ తీసుకున్నాను. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాను. అయితే ట్రైనింగ్‌ టైమ్‌లో రెండో రోజే కాలి వేలు ఫ్రాక్చర్‌ అయ్యింది. డాక్టర్‌ సలహా మేరకు కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకుని, మళ్లీ శిక్షణ తీసుకుని షూటింగ్‌కి ఎంటర్‌ అయ్యాను.

► ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ని కాబట్టి కొన్ని రకాల తుపాకీలను హ్యాండిల్‌ చేయాల్సి వచ్చింది. అయితే మా నాన్న పోలీస్‌ కావడంతో గన్స్‌ పట్టుకోవడం తెలుసు. కానీ ఈ సినిమా కోసం ఏకే 47 లాంటి పెద్ద వెపన్స్‌ని హ్యాండిల్‌ చేయాల్సి రావడంతో శిక్షణ తీసుకున్నాను. గ్లామరస్‌ క్యారెక్టర్సే కాదు.. ఏ పాత్ర అయినా చేయగలనని ఈ సినిమా నిరూపిస్తుంది.

► నాగార్జునగారిని ఫస్ట్‌ టైమ్‌ కలిసినప్పుడు కాస్త నెర్వస్‌ అయ్యాను. అయితే పది నిమిషాలు మాట్లాడాక నా భయం పోయింది. నాగార్జునగారు కింగ్‌ అఫ్‌ రొమాన్స్‌. ‘వేగం...’ పాటలో మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. నాగార్జునగారితో ఓ రొమాంటిక్‌ సినిమా చేయాలని ఉంది.

► మాది సంప్రదాయ రాజ్‌పుత్‌ కుటుంబం. మా కుటుంబంలో ఆడవాళ్లు ఇంటి నుండి బయటకు రావడమే పెద్ద విషయం. అలాంటిది నేను  సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా పరిశ్రమలో నాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ఏ అవగాహన కూడా లేదు. అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. ఎత్తుపల్లాలను ఎలా తీసుకోవాలో సినిమా పరిశ్రమే నేర్పింది.  

మరిన్ని వార్తలు