Venkat Prabhu: హిందీ తెలియకపోయినా ప్రభుదేవా సక్సెస్‌ అయ్యారు,భాష ముఖ్యం కాదు'

27 Sep, 2022 12:38 IST|Sakshi

లఘు చిత్రాల పోటీల్లో గెలుపొందిన వారికి చెన్నైలోని ఓ హోటల్‌లో ఆదివారం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. జ్యూరి సభ్యులుగా దర్శకుడు వసంత్, శింబుదేవన్, వెంకట్‌ప్రభు తదితరులు వ్యవహరించారు. గెలుపొందిన వారికి అవార్డులు, ధ్రువపత్రాలను ప్రదానం చేశారు. దర్శకుడు వెంకట్‌ప్రభు మాట్లాడుతూ.. వేదికపై ఉన్న వారందరూ చప్పట్లు అందుకోవాలన్నదే తన ఆశ అన్నారు. తనకు తెలుగు భాష రాకపోయినా చిత్రం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఆ చిత్రంలో పలువురు తమిళ నటీనటులు నటిస్తున్నట్లు చెప్పారు.

తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించడంతో పలు అనుభవాలను పొందుతున్నట్లు పేర్కొన్నారు. సినిమాకు భాష ముఖ్యం కాదన్న దానికి దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్, ప్రభుదేవా ఉదాహరణ అని అన్నా రు. వాళ్లకి హిందీ తెలియకపోయినా బాలీవుడ్‌లో చిత్రాలు చేసి విజయం సాధించారన్నారు. అదే విధంగా ఆంగ్ల భాష సరిగ్గా తెలియకపోయినా బాలీవుడ్‌ వరకూ వెళుతున్నారన్నారు. కాబట్టి సినిమాకు భాష ఆటంకం కాదన్నారు. ఇకపోతే షార్ట్‌ ఫిలింస్‌ చేయడం చాలా కష్టం అని పేర్కొన్నారు. తనలాంటి వారికీ షార్ట్‌ ఫిలింస్‌కు దర్శకత్వం వహించడం కష్టమేనన్నారు. ఎందుకంటే చెప్పదలచుకున్న విషయాన్ని షార్ట్‌ ఫిలిం ద్వారా 3 నిమిషాల్లో చెప్పాల్సి ఉంటుందన్నారు.

విజయ్, అజిత్‌ అంగీకరిస్తే వారితో మల్టీస్టారర్‌ చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మానాడు చిత్రంలో శింబును సాధారణంగా చూపించానన్నారు. అదే విధంగా వెందు తనిందదు కాడు చిత్రంలో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ శింబును మంచి పాత్రలో చూపించారని అన్నారు. ఆ చిత్రాన్ని చూసి తాను శింబును అభినందించానని చెప్పారు. అప్పుడాయన మనం మళ్లీ ఎప్పుడు కలిసి పని చేస్తున్నాం అని అడిగారనీ, అందుకు తాను సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చేద్దామని చెప్పానన్నారు.

 

మరిన్ని వార్తలు