నన్ను బెదిరిస్తున్నారు : ఇళయరాజా

31 Jul, 2020 20:07 IST|Sakshi

ప్రసాద్‌ స్టూడియోస్‌ వివాదంలో ఇళయరాజా ఫిర్యాదు

ఎల్‌వీ ప్రసాద్‌ మనవడు సాయిపై కేసు

బెదిరించి, స్టూడియోను లాక్కునేందుకు చూస్తున్నారు

సాక్షి,చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా-ప్రసాద్ స్టూడియో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్‌వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై  లయ రాజా తాజాగా మరో కేసు నమోదు చేశారు.  సాయి, అతని మనుషులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తద్వారా తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇళయరాజా ఆరోపించారు. ఈ మేరకు ఆయన మేనేజర్ జాఫర్ ఫిర్యాదు దాఖలు చేశారు.  ('ఇళయరాజా కేసును రెండు వారాల్లో ముగించండి')

ప్రసాద్ స్టూడియోలోని తన సూట్‌లోకి ప్రవేశించి మరీ సంగీత వాయిద్యాలు, నోట్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఇళయరాజా పేర్కొన్నారు. అంతేకాదు తన విలువైన వస్తువులను అధిక మొత్తానికి విక్రయించుకున్నారని కూడా ఆరోపించారు. సాయి, అతని అనుచరులపై శాశ్వత ఆంక్షలు విధించాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే తనపై దౌర్జన్యం చేసి, బలవంతంగా స్టూడియోను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు.  అందుకే స్టూడియోలో తన కార్యక్రమాలకు అడ్డొస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సాయి ప్రసాద్, అతని అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా డిమాండ్‌ చేశారు.
 
కాగా చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ స్థాపకుడు ఎల్‌వీ ప్రసాద్, ఇళయరాజాపై గౌరవంతో ప్రత్యేక గది ఉన్న స్టూడియో స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక్కడున్న రికార్డింగ్ స్టూడియోలోనే గత 40 సంవత్సరాలకు పైగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఎల్‌వీ ప్రసాద్‌ కుమారుడు రమేష్‌ ప్రసాద్‌ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకపోగా, మనవడు సాయి ప్రసాద్ మాత్రం స్టూడియోను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు