ప్రసాద్‌ స్టూడియో నుంచి తప్పుకున్న ఇళయరాజా

29 Dec, 2020 10:03 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రసాద్‌ స్టూడియో యాజమాన్యం, సంగీత దర్శకుడు ఇళయరాజా మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి సోమవారం తెరపడింది. ఇళయరాజా కోసం ప్రసాద్‌ స్టూడియో యాజమాన్యం 1976లో ప్రత్యేక రికార్డింగ్‌ స్టూడియో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఇరుపక్షాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఖాళీ చేయాలని స్టూడియో యాజమాన్యం ఇళయరాజాను కోరింది. ఇందుకు ఇళయరాజా నిరాకరించారు. ఈ వివాదంపై రెండేళ్లుగా మద్రాసు హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించింది. అయితే స్టూడియోలోని తన సంగీత పరికరాలు, అవార్డులను తీసుకునేందుకు, ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇళయరాజా న్యాయస్థానంలో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించిన స్టూడియో యాజమాన్యం ఆ తరువాత కొన్ని షరతులతో అంగీకరించింది. ఏదో ఒక రోజు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది.

ఈ ఆదేశాల మేరకు ఇళయరాజా సోమవారం ఉదయం ప్రసాద్‌ స్టూడియోకు వస్తారని ప్రకటన విడుదలైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళయరాజా, స్టూడియో తరఫు న్యాయవాదులు వచ్చారు. పరికరాలు తీసుకెళ్లేందుకు ఇళయరాజా రాకుండా సహాయకులను పంపారు. అయితే ఇళయరాజా వినియోగించే రికార్డింగ్‌ థియేటర్‌ తలుపులు పగులగొట్టి అందులోని పరికరాలను మరో గదిలోకి తరలించి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఇళయరాజ తీవ్ర మనస్తాపానికి గురై స్టూడియోకి రాలేదని ఆయన పీఆర్వో మీడియాకు తెలిపారు. వీడియోలో అన్ని దృశ్యాలు చిత్రీకరిస్తుండగా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఇళయరాజా సహాయకులే సామగ్రిని తీసుకెళ్లారు. (చదవండి: తానే సీఎం అభ్యర్థి అంటున్న కమల్‌ హాసన్)

మరిన్ని వార్తలు