డైరెక్టర్‌ సుకుమార్‌ ఇంటిపై ఐటీ దాడులు!

19 Apr, 2023 12:35 IST|Sakshi

మైత్రి మూవీ మేకర్స్‌ ఆఫీసుల్లోనూ కొనసాగిన తనిఖీలు  

విదేశాల నుంచి నిధుల మళ్లింపు, జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలపై ఆరా

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ సుకుమార్‌ ఇల్లు, మైత్రి మూవీస్‌ కార్యాలయాల్లో ఆదాయపన్నుశాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా తీసుకోవడం, వాటికి సంబంధించి పన్నుల చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఈ సోదా లు చేపట్టినట్టు తెలిసింది. సదరు చిత్ర నిర్మాణ సంస్థ భారీ చిత్రాల నిర్మాణానికి అవసరమైన డబ్బులను విదేశాల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిందని, ఈ సొమ్ము రూ.500 కోట్లకుపైగా ఉండడంతో ఐటీ అధికారులు ఫోకస్‌ పెట్టినట్టు తెలిసింది. 

జీఎస్టీ చెల్లింపుల్లోనూ అవకతవకలు
 
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి డబ్బులు పెట్టుబడుల రూపంలో సేకరించడంతోపాటు, జీఎస్టీ చెల్లింపులలోనూ అవకతవకలు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. మైత్రి మూవీస్, డైరెక్టర్‌ సుకుమార్‌ల కాంబినేషన్‌లోనే పుష్ప–2 సినిమా తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే ఐటీ అధికారుల బృందాలు సుకుమార్‌ ఇల్లు, మైత్రి కార్యాలయాల్లో సోదాలు జరిపి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నట్టు తెలిసింది.

(చదవండి: నందినికి పొగరు, పట్టుదల.. నాతో పోలికే లేదు: సంయుక్త మీనన్‌)

మైత్రీ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు జనవరిలో విడుదలకు ముందు సమయంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఇప్పుడు మరోసారి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని మైత్రీ మూవీస్‌ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. స్వా«దీనం చేసుకున్న పత్రాలు, డాక్యుమెంట్స్‌ ఆధారంగా గురువారం విచారణ కోసం కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు సమాచారం.

(చదవండి: సూర్యగ్రహణం రోజు గర్భిణీలు పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు..!)

మరిన్ని వార్తలు