టాలీవుడ్‌లో కొత్త రెపరెపలు!

16 Aug, 2021 03:29 IST|Sakshi
తమన్నా, నితిన్‌; నాగశౌర్య ; నిఖిల్‌

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, కొత్త పోస్టర్లు, విడుదల తేదీల ప్రకటనలు.. ఇలా పలు అప్‌డేట్స్‌తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ రెపరెపలాడింది. ఆ అప్‌డేట్స్‌ విశేషాలు..

హిందీ హిట్‌ ‘అంధాధున్‌’ తెలుగులో ‘మ్యాస్ట్రో’గా రీమేక్‌     అవుతున్న సంగతి తెలిసిందే. నితిన్, నభా నటేష్‌ జంటగా, తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యాస్ట్రో’ కొత్త పోస్టర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఇక కెరీర్‌లో తొలిసారి ‘లక్ష్య’ చిత్రంలో విలుకాడుగా కనిపించనున్నారు నాగశౌర్య. ఈ చిత్రం కొత్త పోస్టర్‌ రిలీజైంది. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మించిన ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు.

మరోవైపు  సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్‌’, సుశాంత్‌ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ కొత్త పోస్టర్స్‌ వచ్చాయి. అలాగే జిల్లా కలెక్టర్‌ పంజా అభిరామ్‌గా థియేటర్స్‌లో చార్జ్‌ తీసుకోనున్నారు సాయిధరమ్‌ తేజ్‌. దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్న ‘రిపబ్లిక్‌’లో కలెక్టర్‌ అభిరామ్‌గా చేస్తున్నారు సాయితేజ్‌. జె.భగవాన్, జె. పుల్లారావు, జీ స్టూడియోస్, జేబీ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్న ‘రిపబ్లిక్‌’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 1న విడుదల కానుంది.

ఇక తన కెరీర్‌లో తొలిసారిగా నిఖిల్‌ గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ‘గూఢచారి’, ‘ఎవరు’వంటి సినిమాలకు ఎడిటర్‌గా వర్క్‌ చేసిన గ్యారీ బి.హెచ్‌ ఈ స్పై థ్రిల్లర్‌ మూవీతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాకు కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మాత. ఇంకోవైపు గొడవలంటే భయపడే ఓ అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమకోసం విశాఖపట్నంలో ‘గల్లీరౌడీ’గా మారాడు. సందీప్‌ కిషనే ఈ వెండితెర గల్లీరౌడీ. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సత్యానారాయణ నిర్మించిన ‘గల్లీరౌడీ’ చిత్రాన్ని సెప్టెంబరు 3న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత జీవీ. జి. నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే కూడా అందించారు కోన వెంకట్‌.

ఇటు ఆది సాయి కుమార్‌ ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు. వరుస సినిమాలు కమిట్‌ అవుతున్నారు. ఇప్పటికే ‘కిరాతక’, ‘బ్లాక్‌’ వంటి సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్‌ తాజా చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌. టీఎమ్‌టీ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను కల్యాణ్‌ జి. గోగణ డైరెక్ట్‌ చేస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తిరుమల్‌ రెడ్డి యెల్లా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. 

సత్యదేవ్‌;సాయిధరమ్‌ తేజ్‌; సందీప్‌ కిషన్, నేహాశెట్టి
టాలీవుడ్‌లో తనదైన శైలి యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సత్యదేవ్‌ ‘హబీబ్‌’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తన కొడుకు కోసం ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లిన ఓ ఆర్మీ ఆఫీసర్‌ కథే ‘హబీబ్‌’. సత్యదేవ్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జెన్నీఫర్‌ అల్ఫోన్స్‌ దర్శకురాలు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను హబీబ్‌ సఫీ, కోటి రావ్‌ నిర్మిస్తున్నారు.

ఆది, పాయల్‌ రాజ్‌పుత్‌; సుధీర్‌బాబు, ఆనంది; సుశాంత్, మీనాక్షి;
ఇటు ‘బుజ్జి.. ఇలారా’ చిత్రం కోసం సీఐ కేశవ్‌ నాయుడిగా చార్జ్‌ తీసుకున్నారు ధన్‌రాజ్‌. ఇందులో సునీల్‌ మరో హీరో. ‘గరుడవేగ’ అంజి డైరెక్షన్‌లో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రూపా జగదీష్‌ సమర్పణలో అగ్రహారం సంజీవరెడ్డి, నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక డా.మోహన్, నవీన్‌చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ ‘1997’. ఈ సినిమాలోని నవీన్‌చంద్ర లుక్‌ను హీరో విశ్వక్‌సేన్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి మీనాక్షీ రమావత్‌ ప్రొడ్యూసర్‌. ‘కోతికొమ్మచ్చి’ తర్వాత హీరో మేఘాంశ్‌ శ్రీహరి తాను నటించనున్న తర్వాతి సినిమాను తన తండ్రి, ప్రముఖ నటులు శ్రీహరి జయంతి సందర్భంగా ఆదివారం ప్రకటించారు. సి.కల్యాణ్‌ నిర్మించనున్న ఈ సినిమాకు ‘రాసి పెట్టుంటే’ టైటిల్‌ను ఖరారు చేశారు.

నందు మల్లెల ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా ‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌ మాధవ్‌ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘గంధర్వ’ ఫస్ట్‌లుక్, మోషన్‌ పోస్టర్‌ విడుదలయ్యాయి. అప్సర్‌ డైరెక్ట్‌ చేస్తున్న ‘గంధర్వ’ సినిమాను ఎమ్‌ఎన్‌ మధు నిర్మిస్తున్నారు. మరోవైపు ‘సింధూరపువ్వు’ రాంఖీ, హర్షిత్‌రెడ్డి, వికాస్‌ వశిష్ట, రాఖీ ప్రధాన పాత్రల్లో అమర్‌నాథ్‌ రెడ్డి గుంటక దర్శకత్వంలో ఆర్కే రెడ్డి నిర్మిస్తున్న ‘గగనవీధి’ సినిమా టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను లాంచ్‌ చేశారు.1980 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరనే సందేశంతో వస్తుందని చిత్రయూనిట్‌ పేర్కొంది.  ఇక ‘1948: అఖండ భారత్‌’ సినిమా పోస్టర్స్, లిరికల్‌ వీడియోను ఆదివారం విడుదల చేశారు.

‘ది మర్డర్‌ ఆఫ్‌ మహాత్మాగాంధీ’ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో రఘునందన్, ఆర్యవర్ధన్‌రాజ్, శరద్‌ దద్భావల, ఇంతియాజ్, జెన్నీ, సమ్మెట గాంధీ ప్రధాన పాత్రధారులు. ఈశ్వర్‌ డి.బాబు దర్శకత్వంలో ఈ సినిమాను ఎమ్‌.వై. మహర్షి నిర్మించారు. గాంధీని గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చింది?, కోర్టులో గాడ్సే వాదనలు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. ‘అజాద్‌ హింద్‌’ పేరుతో అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను ఓ ఫ్రాంచైజీలా నిర్మించనున్నట్లు వెల్లడించారు నిర్మాత విష్ణువర్ధన్‌. ఇందులో భాగంగా దుర్గా భాయ్‌ జీవితాన్ని ఫస్ట్‌ తెరకెక్కించనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’, ‘జాంబీరెడ్డి’ సినిమాలకు మాటలు అందించిన సయ్యద్‌ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారనున్నారు.
కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత థియేటర్లు రీ ఓపెన్‌ అయి, వరుసగా సినిమాలు విడుదలవుతుంటే మరోవైపు నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్స్, కొత్త సినిమాల అప్‌డేట్స్‌తో టాలీవుడ్‌ కళకళలాడటం ఆనందించదగ్గ విషయం.


 

మరిన్ని వార్తలు