ఇండియన్‌ 2: దర్శకుడు శంకర్‌కు ఊరట 

2 Apr, 2021 14:07 IST|Sakshi

చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించడంపై స్టే విధించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. నటుడు కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఇండియన్‌ 2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం నుంచి పలు అవరోధాలను ఎదుర్కొంటోంది. కరోనాకు ముందే ఇండియన్‌ 2 చిత్రం నిలిచిపోయింది. దీంతో శంకర్‌ ఇతర చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైకా సంస్థ శంకర్‌ పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అందులో శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా తమ సంస్థ ఇండియన్‌ 2 చిత్రం నిర్మిస్తోందని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి రూ.150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అయితే ఇప్పటికే రూ.236 కోట్లు అయ్యిందని తెలిపారు. ఇప్పటికీ 80 శాతం షూటింగ్‌ మాత్రమే పూర్తయిందని పేర్కొన్నారు. శంకర్‌కు రూ. 40 కోట్లు పారితోషకం చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అందులో రూ. 14 కోట్లు అడ్వాన్‌గా చెల్లించామన్నారు. అయితే తమ చిత్రాన్ని పూర్తి చేసే వరకు శంకర్‌ ఇతర చిత్రాలకు పని చేయకుండా ఆయనపై నిషేధించాలని కోరారు. ఈ కేసు గురువారం న్యాయమూర్తి పీటీ.ఆషా సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించరాదంటూ శంకర్‌పై నిషేధం వధించలేమని పేర్కొన్నారు. శంకర్‌ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు. 

చదవండి: డైరెక్టర్‌ శంకర్‌పై నిర్మాతల కేసు!

మరిన్ని వార్తలు