నేను హ్యాపీ అని ‘దిల్‌’రాజు అన్నారు

1 Sep, 2020 02:31 IST|Sakshi

నాని, సుధీర్‌బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు
ఇంద్రగంటి మోహనకృష్ణ పలు విషయాలను పంచుకున్నారు.

► సినిమాను థియేటర్లలోనే రిలీజ్‌ చేయాలని దాదాపు ఐదు నెలలు ‘దిల్‌’ రాజుగారిని నేను, నాని బతిమాలి ఓ నాలుగునెలల పాటు లాక్కొచ్చాం. రాజుగారు ఓ రోజు ‘కరెక్ట్‌గా థియేటర్లు ఎప్పుడు ఓపెన్‌ చేస్తారో ఓ డేట్‌ చెప్ప’మన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనుచూపు మేరలో ఆ పరిస్థితి కనపడటంలేదు. అందుకనే ఈ సినిమాని డిజిటల్‌లో విడుదల చేయటానికి మొగ్గుచూపాం.

► ప్రతి విషయానికి పాజిటివ్, నెగిటివ్‌ ఉన్నట్లే ఈ సినిమాకు డిజిటల్‌ రిలీజ్‌ కూడా ప్లస్‌ అవుతుందనుకుంటున్నా. ఎందుకంటే ‘వి’ చిత్రాన్ని శుక్రవారం రాత్రి 12గంటలకు విడుదల చేస్తున్నాం. దాదాపు 200 దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది. జనరల్‌గా మా అమ్మగారు, అత్తగారు లాంటి 70 ఏళ్ల వయసున్నవారు థియేటర్లకు వచ్చి సినిమా చూడరు. నా సినిమాకు అలాంటివాళ్లందరూ ఎక్స్‌ట్రా ఆడియన్స్‌. మొదటివారం సినిమా చూసే ప్రేక్షకులంతా మొదటిరోజే చూస్తారు. శనివారం హాలిడే కాబట్టి అందరూ నైట్‌ పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌ను పక్కన పెట్టుకుని ఇంట్లో సినిమాని ఎంజాయ్‌ చేస్తారనుకుంటున్నా. ఎటొచ్చీ ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూడలేకపోతున్నామనే బాధ తప్ప మిగతా అన్నీ మంచి విషయాలే. కానీ, నాకు వ్యక్తిగతంగా థియేటర్‌ అంటేనే ఇష్టం. ఇదొక (ఒటీటీ) ఫేజ్‌ మాత్రమే అనుకుంటున్నా.

► ‘దిల్‌’ రాజుగారు ఈ సినిమాకు నిర్మాత అయినా ఆయన ఒక బయ్యర్, డిస్ట్రిబ్యూటర్‌ కూడా. ఓటీటీలో రిలీజ్‌ చేయటం వల్ల ఆయనకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు. ‘సార్‌ మీరు హ్యాపీయా’ అని అడిగితే, ‘హ్యాపీ మోహన్‌’ అన్నారు. లేకపోతే ఆయన అంత తేలిగ్గా ఓటీటీలో రిలీజ్‌ అనే నిర్ణయం తీసుకోరు.

► నానీతో నా అనుబంధం పుష్కరకాలం. నానీకి ఈ కథ చెప్పినప్పుడు ఇది తనకు 25వ సినిమా అని నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది. అప్పుడు నానీని ‘ఇది నీ 25వ సినిమా కదా. ఈ పాత్ర (విలన్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌) ఏమైనా చేయడానికి ఇబ్బందా అంటే లేదన్నాడు. మొన్న సినిమా చూసిన తర్వాత ‘ఇది నా 25వది అయినందుకు, ఆ 25వ సినిమా మీతో చేసినందుకు హ్యాపీ’ అని నాని అన్నాడు.

► విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేయాలి. అది ఎప్పుడు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేను. ఇద్దరు, ముగ్గురు నిర్మాతలకు ఓ సినిమా చేసి, మళ్లీ ‘దిల్‌’ రాజుగారితో సినిమా చేస్తాను.

► ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్‌ అంటే క్రియేషన్‌ మీద పెట్టాల్సిన శ్రద్ధ శానిటేజషన్‌ మీద పెట్టాల్సి వస్తుందేమో. సెప్టెంబర్, అక్టోబర్‌లలో కొన్ని సినిమాల షూటింగ్‌ను ప్రారంభిస్తున్నారట. చూద్దాం.. ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందో. రానున్న ఐదారు నెలల్లో నిర్మాతలు, దర్శకులు, నటులు సరికొత్త చాలెంజ్‌లను ఎదుర్కొనే పరిస్థితి రాబోతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు