'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా..' నటి బర్త్‌డే?

14 May, 2021 09:55 IST|Sakshi

అలనాటి అందాల తార వహీదా రెహమాన్‌ టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. ఆమె పేరు చెప్పగానే చాలామందికి రోజులు మారాయి సినిమాలో ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా.. పాట గుర్తొస్తుంది. ఇదే ఆమె మొదటి చిత్రం అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించింది. అలీబాబా 40 దొంగలు సినిమాలోనూ ఓ స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడింది. ఇంతకీ ఈ రోజు వహీదా ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. నేడు ఆమె బర్త్‌డే కాని బర్త్‌డే. ఏంటి? అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే!

డాక్టర్‌ కావాలనుకుని యాక్టర్‌ అయిన వారిలో వహీదా ఒకరు. ఆమె 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించింది. చిన్నప్పుడే నాట్యం నేర్చుకుంది. తండ్రి మొహమ్మద్‌ అబ్దుర్‌ రెహమాన్‌ మరణంతో ఆమె నృత్యమే తనకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూతనిచ్చింది. ఎన్టీఆర్‌ తన సొంత సంస్థలో 'జయసింహ' కథ తీసేందుకు రెడీ అవగా ఇందులో రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని తీసుకుకోవాలని భావించాడు. అలా ఈ పాత్ర వహీదా రెహమాన్‌ను వరించింది.

కానీ అప్పటికే దర్శకుడు తాపీ చాణక్య ఆమెను 'రోజులు మారాయి'లోని ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా పాటకు ఆమెతో డ్యాన్స్‌ చేయించడంతో ఇదే ఆమెకు తొలి సినిమాగా మారింది. ఇందులో ఆమె డ్యాన్స్‌ చూసిన గురుదత్‌ ఆమెను 'సీఐడీ'తో హిందీ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. 1971లో 'రేష్మా ఔర్‌ షేరా' చిత్రంతో వహీదా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచింది. 1972లో 'పద్మశ్రీ', 2011లో 'పద్మభూషణ్' అందుకుంది. తన తొలి హీరో ఎన్టీఆర్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందించే ఎన్టీఆర్ నేషనల్ అవార్డును 2006లో సొంతం చేసుకుంది. 

రెహమాన్‌ను గురుదత్‌ ఎంతో ప్రేమించాడు. కానీ ఆయనకు అప్పటికే పెళ్లైంది. 1974లో హీరో కమల్‌ జీత్‌ను పెళ్లి చేసుకుంది వహీదా. వీరికి ఇద్దరు సంతానం. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో వహీదా బోటింగ్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు పనిలో పనిగా వహీదాకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. కానీ నేడు ఆమె పుట్టిన రోజు కాదు, ఫిబ్రవరి 3 అసలు బర్త్‌డే. ఇదే విషయాన్ని ఆమె ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ రోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారట అభిమానులు. దీంతో ప్రతి ఏటా రెండుసార్లు బర్త్‌డే జరుపుకుంటోంది వహీదా..

మరిన్ని వార్తలు