Waluscha De Sousa: ‘చింగారీ’ సాంగ్‌ ఫేం వలూశా డిసూజా గురించి ఈ విషయాలు తెలుసా?

5 Jun, 2022 10:41 IST|Sakshi

సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘అంతిమ్‌’ సినిమా గుర్తుండే ఉంటుంది. పోనీ అందులోని చింగారీ పాట? అరే.. ఆ పాటను.. ఆ పాట మీద మహారాష్ట్ర జానపద నృత్యం ‘లావణి’ని నర్తించిన  వలూశా డిసూజాను ఎలా మరచిపోతాం అంటారా? అందుకే ఇంకోసారి గుర్తు చేయడానికి వలూశా డిసూజా వివరాలను తీసుకొచ్చాం.. 

వలూశా.. యురోపియన్‌ ఇండియన్‌. తల్లి జర్మన్‌.. తండ్రి పోర్చుగీసు. ఆమె పుట్టింది, పెరిగింది గోవాలో. చదివింది ముంబైలోని సెయింట్‌ జేవియర్స్‌ కాలేజ్‌లో. సైకాలజీలో డిగ్రీ చేసింది. 

చిన్నప్పటి నుంచి ఆటలంటే ప్రాణం వలూశాకు. అందుకే అథ్లెట్‌గా రాణించింది. తర్వాత మోడలింగ్‌లో అవకాశాలు రావడంతో మోడల్‌ అయింది. 

షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘ఫ్యాన్‌’ గుర్తుంది కదా.. 2016లో వచ్చింది. అందులో వలూశా నటించింది. ఆ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేసింది. ‘ఫ్యాన్‌’ నిర్మాతలకే కాదు వలూశాకూ ఫెయిల్యూరే. దానితో ఆమెకెలాంటి గుర్తింపు రాలేదు. 

ఆ చిత్రం ఇవ్వలేని రికగ్నిషన్‌ను ‘అంతిమ్‌’ ఇచ్చింది.. చింగారీ పాటతో. అప్పటి నుంచి వలూశా నటిగా బిజీగానే ఉంటోంది. 

ఇప్పుడు హాట్‌ స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతున్న  టెక్‌ థ్రిల్లర్‌ ‘ఎస్కేప్‌ లైవ్‌’తో వెబ్‌ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ వెబ్‌ సిరీస్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యి దేశంలోని గడప గడపకూ ఆమెను పరిచయం చేసింది.. వెబ్‌ ప్రేమికులను ఆమె వీరాభిమానులుగా మారుస్తోంది. 

నా చుట్టూ ఉన్న నెగెటివిటీ నుంచి సాధ్యమైనంత వరకు తప్పించుకుంటూ ఉంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో రియాలిటీ నుంచి తప్పించుకోవడానికి  సోషల్‌ మీడియా ఓ  మార్గంగా మారింది చాలా మందికి. అది ఆహ్వానించదగ్గ పరిణామం కాదేమో!
– వలూశా డిసూజా

మరిన్ని వార్తలు