Mahesh Babu: గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’ మన సూపర్‌ స్టార్‌..

9 Aug, 2021 10:33 IST|Sakshi

సాక్షి, వెబ్ డెస్క్:  సూపర్‌ స్టార్‌ క్రిష్ణ నట వారసుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు మహేశ్‌ బాబు. ఆ తర్వాత తనదైన నటనతో సూపర్‌ స్టార్‌గా మారాడు. తెరపై మిల్క్‌ బాయ్‌గా పిలిపించుకుంటూ ప్రియురాలిని ఆటపించే ‘పోకిరి’లా,  కామెడీతో, మాస్‌లుక్‌తో అలరించే మహేశ్‌.. బయట మాత్రం తనదైన మ్యానరిజంతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. పెద్ద స్టార్‌ అయినప్పటికీ పలు సినీ కార్యక్రమాల్లో, ఇంటర్వ్యూలలో తక్కువ మాట్లాడుతూ ఒదిగిపోయే తత్త్వంలో అభిమానుల గుండెల్లో ‘మహర్షి’లా నిలిచిపోయాడు.

ఇక పరిశ్రమలో కూడా ప్రతి ఒక్కరితో సఖ్యతగా ఉంటూ ఎంతో మంది సన్నిహితులు, స్నేహితులను సంపాదించుకున్న మన సూపర్‌ స్టార్‌లో దాతృత్వ లక్షణాలు కూడా ఎక్కువే. 2016లో ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్న ఈ ‘శ్రీమంతుడు’. ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఆయా గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ కనిపించని నిజంలా అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని రెయిన్‌ బో ఆస్పత్రితో కలిసి ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి మానవత్వం చాటుకుంటున్నారు. ఆర్ధికంగా బలంగా లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ నిజ జీవితంలోనూ గొప్ప మనసున్న ‘అతిథి’గా మహేశ్‌ అందరిచేత కీర్తించబడుతున్నాడు.


ఇవి మాత్రమే కాకుండా క్టిష్ట పరిస్థితిల్లో ప్రభుత్వాలకు అండగా ఉంటున్నాడు. హుదుద్‌ తుపాను సమయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు  విరాళంగా రూ.2.5 కోట్లు, కరోనా సమయంలో సినిమా కార్మికులకు కోసం రూ.25 లక్షలు అందజేశారు. అలాగే తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు