Samantha Ruth Prabhu: కొత్తదనం కోసమే... అలా చేశా!

22 Nov, 2021 05:15 IST|Sakshi

రాజీ పాత్ర ఎంచుకోవడానికి కారణం ఇదే

తెలుగు పరిశ్రమ, హైదరాబాద్‌ నా పుట్టినిల్లు

‘ఇఫీ’లో సమంత

‘‘ఏ నటి, నటుడైనా ఎప్పుడూ ఒకే రక మైన పాత్రలు చేయాలనీ, అవే రకమైన భావోద్వేగాలను చూపించాలనీ అనుకోరు. సవాలు నిండిన కొత్త పాత్రలు, కథా నేపథ్య వాతావరణం కోసం చూస్తారు’’ అన్నారు నటి సమంత. గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 52వ ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ)లో ఆదివారం ఆమె మాట్లాడుతూ, ‘ఫ్యామిలీమ్యాన్‌–2’ వెబ్‌సిరీస్‌లోని క్లిష్టమైన యాక్షన్‌ పాత్ర రాజీని తాను ఎంచుకోవడానికి కారణాన్ని అలా వివరించారు. ‘‘ఆ సిరీస్‌ రూపకర్తలు రాజ్, డీకే నన్ను వ్యక్తిగతంగా కలవకుండానే, అందులోని యాక్షన్‌ పాత్రకు నన్ను ఎంచుకున్నారు. తీరా నన్ను కలిశాక, (నవ్వుతూ...) వారికి తమ తప్పు దిద్దుకొనే టైమ్‌ దాటిపోయింది. కొత్తదనం కోసం తపిస్తున్న నేనూ ఆ పాత్రను ఠక్కున పట్టేసుకున్నా’’ అన్నారు సమంత.

52వ ‘ఇఫీ’లో భాగంగా ఫ్యామిలీమ్యాన్‌ రూపకర్తలు రాజ్, డీకే, నటి సమంత, అమెజాన్‌ ఇండియా ఒరిజినల్స్‌కు హెడ్‌ అయిన అపర్ణా పురోహిత్‌లతో ‘మాస్టర్‌క్లాస్‌’ గోష్ఠి జరిగింది. అందులో సమంత మాట్లాడుతూ, ‘‘తెలుగు పరిశ్రమ, హైదరాబాద్‌ నా పుట్టినిల్లు. నటిగా నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది అవే. నేనింకా హిందీ సినిమాలేవీ చేయలేదు కానీ, ఉత్తరాది పరిశ్రమకూ, దక్షిణాదికీ పెద్ద తేడా ఏమీ లేదు’’ అన్నారు.

‘‘సినిమా, ఓటీటీ దేనికదే. చీకటి హాలులో అంతరాయాలకు దూరంగా చూసే సినిమాతో పోలిస్తే, ఇంట్లో టీవీలో అనేక అంతరాయాల మధ్య చూసే ఓటీటీ వెబ్‌ సిరీసుల్లో ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టి, మెప్పించడం చాలా కష్టం. రొటీన్‌కు భిన్నమైన భావోద్వేగాలనూ, పాత్రలనూ పండించేందుకు నటీనటులకు కూడా ఓటీటీ ఓ అవకాశం, పెద్ద సవాలు’’ అని సమంత తన మనసులో మాటను పంచుకున్నారు. ‘ఫ్యామిలీమ్యాన్‌ 2’లోని పాత్రతో ఇక హిందీ ‘ధూమ్‌’ సిరీస్‌ లాంటి వాటిలో అవకాశాలు రావచ్చన్న ప్రేక్షకుల ప్రశంసకు సమంత ఉబ్బితబ్బిబ్బవుతూ, ‘‘నేనిక ‘యాక్షన్‌ స్టార్‌’ అన్న మాట’’ అని నవ్వేశారు.

అవి కాగానే సమంత ఏడ్చేశారు!
దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే మాట్లాడుతూ, ‘‘ఆ పాత్రకు తమిళం తెలిసిన నటి కావాలనుకున్నాం. తమిళ చిత్రం ‘సూపర్‌డీలక్స్‌’, తెలుగు ‘రంగస్థలం’ చూసి, ఆ పాత్రకు సమంత సరిపోతారనుకొని, సంప్రదించాం. మా అంచనాలను మించి ఆమె చేశారు. పాత్రను పూర్తిగా మనసుకు ఎక్కించుకొని, ఆ భావోద్వేగాల్లోనే జీవిస్తూ, కొన్ని సీన్లు కాగానే ఆమె వెక్కివెక్కి ఏడ్చిన ఘటనలు మాకు ఇప్పటికీ గుర్తే. చేతులకు గాయమై రక్తం కారుతున్నా డూప్‌లు లేకుండా సమంత చేసిన ఫైట్లు చూసి, ఆశ్చర్యపోయాం’’ అన్నారు. ‘‘మనోజ్‌ బాజ్‌పాయ్‌ పోషించిన సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రను కథలో బెంగాలీ పాత్రగా రాసుకున్నాం.

ఆడిషన్స్‌లో ఆ పాత్రకు మనోజ్‌ అద్భుతంగా సరిపోయేసరికి, సిరీస్‌లో దాన్ని మరాఠీ పాత్రగా మార్చేశాం’’అని వెల్లడించారు. ‘‘ఫ్యామిలీమ్యాన్‌–3’ రచన ఇంకా పూర్తి కాలేదు. మీడియాలో వస్తున్న ఊహాగానాలకు భిన్నంగా మూడో సీజన్‌ ఉండేలా ప్రయత్నిస్తున్నాం’’ అని ఈ దర్శకద్వయం వివరించింది. ‘‘పేరున్న నటీనటులు, ఫైట్లు, ఐటమ్‌ సాంగ్స్‌తో మంచి ప్యాకేజ్‌ చేసి, ఓ హిట్‌ సినిమా తీయవచ్చు. కానీ, ఓటీటీ వెబ్‌సిరీస్‌లలో అది సాధ్యం కాదు. సెక్స్, క్రైమ్‌ అంశాలు ఓటీటీ తొలిరోజుల్లో వరదలా వచ్చినా, అవి పోయి మంచివే నిలబడతాయి’’ అని రాజ్‌ – డీకే పేర్కొన్నారు. కాగా, ‘‘ఓటీటీ రచయితల మాధ్యమమైతే, సినిమా దర్శకుల మాధ్యమం’’ అని అపర్ణ అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు