యోగాతో అందం, ఆరోగ్యం అంటున్న సీనియర్‌ హీరోయిన్లు

21 Jun, 2021 12:20 IST|Sakshi

అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్‌

యోగా..శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా యోగా వైపే అడుగులేస్తున్నారు. యోగాతో ఆరోగ్యం మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే చాలామంది హీరోయిన్లు యోగాతో తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నారు. నాలుగు పదుల వయసులోనూ పడుచుపిళ్లలా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా, ఫిట్‌గా తయారువుతున్న హీరోయిన్లు యోగా గురించి ఏం అంటున్నారో తెలుసుకుందాం.

బాలీవుడ్‌ హీరోయిన్లలో యోగా క్వీన్‌ అనగానే గుర్తొచ్చేది శిల్పాశెట్టి.  46ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ చాలా యంగ్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యోగాపై ఏకంగా ఒక పుస్తకమే రాసేసింది. యోగాతోనే తన డే రొటీన్‌ మొదలవుతుందని పలుమార్లు చెప్పిన శిల్పా..ప్రతిరోజూ ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట. అందుకే ఇప్పటికీ వన్నెతరగని అందంతో సూపర్‌ ఫిట్‌గా అలరిస్తుంది. యోగా నేర్చుకోవాలనుకునే చాలామంది శిల్పాశెట్టి వీడియోలు ఫాలో అవుతారంటే యోగాపై ఆమెకున్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

ఫిట్‌నెస్‌తో యంగ్‌ హీరోయిన్లకు సైతం సవాలు విసురుతున్న మరో బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. 50కి దగ్గర్లో ఉన్నా నేటికీ ఎంతో ఫిట్‌గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. నిత్యం  గంటల తరబడి యోగా చేస్తూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. అంతేకాకుండా ప్రియుడు అర్జున్‌కపూర్‌ చేత కూడా యోగాసానాలు వేయిస్తుంది. యోగాపై అవగాహన కల్పించేందుకు  #StartTohKaro అనే ఒక కార్యక్రమం సైతం చేపట్టింది.

ఫిట్‌నెస్‌ విషయంలో సమంత చాలా శ్రద్ధ తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అబ్బాయిలకు సమానంగా బరువులు ఎత్తుతూ తన స్టామినా ఏంటో ఫ్రూవ్‌ చేసిన సామ్‌..రోజులో కొంత సమయాన్ని యోగా కోసం తప్పకుండా కేటాయించాలని అభిమానులకు సూచిస్తున్నారు. భర్త నాగచైతన్యతో  కలిసి యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. 

హీరోయిన్‌ కరీనా కపూర్‌ ప్రతిరోజు ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట. ప్రతిరోజూ యోగా తన దినచర్యలో భాగమైపోయిందని చెప్పుకొచ్చింది. అందుకే డెలీవరీ తర్వాత కూడా నిపుణుల సూచనలతో యోగాసనాలు వేస్తూ నేటికీ జీరో సైజ్‌ కాపాడుకుంటుంది.
 
యోగాతో అందంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అలవడుతుందని అంటోంది నటి మంచు లక్ష్మి. ఆమె పన్నెండేళ్లుగా యోగా చేస్తోంది. ప్రతిరోజూ యోగా కోసం కొంత సమయం కేటాయించాలని పేర్కొంటుంది. కూతురు నిర్వాణతో కలిసి ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. యోగాతో మరింత దృఢంగా మారొచ్చని అంటోంది మంచు లక్ష్మి.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు ఫిట్‌నెస్‌ మీద ఎంతో ఫోకస్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్‌ తర్వాత యోగా చేయనిదే వేరే పని చేయదట. ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. అంతేకాకుండా యోగా వల్లే తాను కరోనా నుంచి కోలుకున్నానని చెప్పుకొచ్చింది.   యోగా దినోత్సవం సందర్భంగా కంజుర్‌ క్రియతో తన దినచర్యను ప్రారంభిస్తున్నానని పేర్కొంటూ ఆ ఫోటోలను ఇన్‌స్టాగగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

ప్రతిరోజు తన దినచర్యలో యోగా భాగమైపోయిందంటోంది నటి మాధురీ దీక్షిత్‌. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలను షస్త్రర్‌ చేసిన ఆమె.. నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి అంటూ అభిమానులను ప్రోత్సహించింది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు