Intinti Gruhalakshmi:ప్రేమ్‌, శృతి మధ్య ప్రేమ చిగురిస్తోందా?

2 Jun, 2021 13:21 IST|Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 335వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

మెడిసిన్‌లో సీటు సంపాదించిన దివ్య తన చదువుకు ఇక ఏ ఢోకా లేదన్న సంతోషంలో మునిగి తేలుతోంది. కాలేజీలో మొదటిసారి అడుగు పెట్టబోతున్నందుకు తల్లి ఆశీర్వాదాలు తీసుకుంది. తండ్రికి కూడా ఓ మాట చెప్దామని వెళ్తే నందుకు బదులు లాస్య తారసడింది. దొరికిందే ఛాన్సనుకున్న లాస్య.. దివ్య మనసులో విషబీజాలు నాటే ప్రయత్నం చేసింది. తులసితో ఏమీ కాదని, తల్లిని వదిలి వచ్చేయమని ఉచిత సలహా ఇచ్చింది. మరి దీనికి దివ్య ఏమని సమాధానమిచ్చింది? నేటి(జూన్‌ 2) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..

చాలా రోజుల తర్వాత ప్రేమ్‌ను చూసిన శృతి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. దీంతో ఇంటి సభ్యులు ఆమెను ఆటపట్టించారు. ఇక సంగీతం ప్రాక్టీస్‌ చేస్తున్న ప్రేమ్‌ దగ్గరకు వెళ్లిన శృతి సరదాగా సెటైర్లు వేయడంతో అతడు ఆమె వెంటపడ్డాడు. అలా వీరిద్దరూ తమ మధ్య ఉన్న ఎడబాటును చెరిపేస్తూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి నీళ్లలో ఆడుకున్నారు. వీరి జలకాలాటలు చూసి తులసి, ఆమె మామయ్య ఆశ్చర్యపోయారు. దీంతో శృతి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి సిగ్గుతో వెళ్లిపోయింది. ఇదంతా చూస్తుంటే వీళ్ల మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు అంకిత తను గర్భం దాల్చిన విషయాన్ని భర్తతో చెప్పలేక, అలా అని మనసులో దాచుకోలేక తెగ ఇబ్బందిపడింది. తనకు చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేకపోతున్న అభి దగ్గర ఇంత పెద్ద విషయం దాచి మోసం చేస్తున్నానేమోనని బాధతో కంటనీరు పెట్టుకుంది. ఒకవేళ నేను నీ దగ్గర ఏదైనా దాస్తే ఏం చేస్తావు? అని అంకిత అడగ్గా.. నువ్వు నా దగ్గర ఏదీ దాచలేవన్న నమ్మకం తనకుందని, ఒకవేళ అలా దాచితే అప్పుడు మన మధ్య ప్రేమ, నమ్మకానికి చోటు లేనట్లేనని అభి చెప్పడంతో అంకిత మరింత ఎమోషనల్‌ అయింది.

ఇక దివ్య తను కాలేజీకి మొదటిసారి వెళ్తున్నానని, అందుకు ఆశీస్సులు కావాలంటూ తల్లి కాళ్ల మీద పడిపోయింది. నిజానికి తనకు ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయని, కాకపోతే ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుందని, అందుకోసమే వెళ్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే కాలేజీకి వెళ్లేముందు నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోమని తులసి సూచించింది. నువ్వు డాక్టర్‌ కావాలని నాన్న ఎన్నో కలలు కన్నాడని చెప్తూ తప్పకుండా ఈ విషయం మీ నాన్నకు చెప్పి తీరాల్సిందేనని అనడంతో దివ్య నేరుగా లాస్య ఇంటికి వెళ్లింది.

దివ్య తన ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయిన లాస్య మెడిసిన్‌ ఫీజు కోసం వచ్చావా? అని ఎగతాళి చేసింది. అయినా నువ్వు మీ అమ్మతో ఉంటే భవిష్యత్తు గంగలో కలిసినట్లేనని, చదువుకోలేవని మనసులో విషం నింపే ప్రయత్నం చేసింది. నీ తల్లిని నమ్ముకుంటే ఏమీ మిగలదని, సరాసరిగా ఇక్కడికి వచ్చేయమని సూచించింది. ఎందుకంటే నీకు తండ్రైన నందు ఇప్పుడు తనవాడని చెప్పింది. దీంతో ఒక్కసారిగా నవ్వేసిన దివ్య మా నాన్నకు నీ మీదున్న నమ్మకం కన్నా నా మీదున్న ప్రేమే ఎక్కువ అని చెప్పడంతో లాస్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. తన తల్లి దగ్గర సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పడంతో లాస్య ముఖం మాడిపోయింది. మరి దివ్య నందు ఆశీర్వాదాలు తీసుకుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

చదవండి: Gunasekhar: అందుకే ఆ హీరోలు నన్ను దూరం పెట్టలేదు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు