నిజం తెలుసుకున్న నందు, లాస్యలో మొదలైన టెన్షన్‌!

8 Jun, 2021 14:01 IST|Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 340వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

తులసిని ఓడించాలని లాస్య, తులసి మీద విజయం సాధించాలని నందు  తెగ కష్టపడుతున్నారు. అయితే ఇందులో ఒకరిది స్వార్థం అయితే మరొకరిది అవసరం. ఏదేమైనా నందు ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి అతడి పరిస్థితి దయనీయంగా మారింది. కంపెనీ కష్టాల్లో కూరుకుపోతూ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్నాడు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లాస్యే కారణమైనప్పటికీ ఆ విషయం తెలియని నందు ఆమెను గుడ్డిగా నమ్ముతుండటం శోచనీయం. తులసిని ఓడించాలన్న లాస్య ప్లాన్‌ కూడా బెడిసికొట్టింది. అసలు నేటి(జూన్‌ 8) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి..

తులసి తన ప్రాజెక్ట్‌ చేజారిపోయినందుకు బాధపడలేదు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా నవ్వుతూ ఎదుర్కొనే ఆమె ఈ విషయాన్ని కూడా పాజిటివ్‌గానే స్వీకరించింది. కానీ అంతలోనే కంపెనీ నుంచి ఆమెకు ఫోన్‌కాల్‌ వచ్చింది. తనకు పోటీగా వచ్చిన స్టెల్లా డిజైన్లు కాపీవని తేలాయని, నిజాయితీగా స్వంత డిజైన్లు గీసిన మీకు ప్రాజెక్ట్‌ అప్పగిస్తున్నామని వెల్లడించింది. దీంతో తులసి ఇంట్లో ఆనందాలు వెల్లివిరిసాయి.

మరోపక్క ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలా? అని నందు మల్లగుల్లాలు పడ్డాడు. తనకు సాయం చేయమని తండ్రి కాళ్ల మీద పడ్డాడు. తను పెట్టిన కంపెనీ కష్టాల్లో ఉందని, ఉద్యోగులకు చిల్లిగవ్వ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నానని కన్నీరు పెట్టుకున్నాడు. నీకేదైనా సాయం చేయగలిగితే అది తులసి మాత్రమేనని తండ్రి తేల్చి చెప్పడంతో నందు తన అహాన్ని అణుచుకుని భార్యను అర్థించాడు. తనను గండం నుంచి గట్టెక్కించమని కోరాడు.

దీంతో విస్తుపోయిన తులసి తన తాళిని ఎగతాళి చేసినందుకు సాయం చేయాలా? కుటుంబాన్ని అనాథలా వదిలేసినందుకు సాయం చేయాలా? అని మండిపడింది. తన చేత పెట్టించిన కన్నీరే నీ పతనానికి కారణమైందంటూ భర్త మీద విరుచుకుపడింది. కానీ ఇదంతా కల అని తెలియడంతో నందు నిద్రలో నుంచి లేచి ఉలిక్కిపడ్డాడు నందు. తులసిని సాయం అడగ​కుండానే జీవితంలో గెలిచి తీరాలని సంకల్పించాడు. తులసిని మాత్రం ప్రాధేయపడకూడదని నిర్ణయించుకున్నాడు.

నందు తనకు సాయం చేయమని స్నేహితుడు దివాకర్‌ను కోరాడు. ఇప్పుడు పెట్టుబడి పెడితే వచ్చే లాభం మొత్తాన్ని తనకే ఇస్తానని చెప్పడంతో అతడు సానుకూలంగా స్పందించాడు. ఈ మేరకు ఇద్దరూ అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. అయితే ఇలా లాభం లేకుండా బిజినెస్‌ చేయడం లాస్యకు ఏమాత్రం నచ్చలేదు. కానీ తులసిని ఓడించాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదని చెప్పడంతో ఆమె ఊరుకుండిపోయింది.

ఇక రేపటి ఎపిసోడ్‌లో నందు మరోసారి తాగి తూగినట్లు కనిపిస్తోంది. తనకు తెలిసినవారే వెన్నుపోటు పొడుస్తూ ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారని ఆవేదన చెందాడు. నీడలా ఉంటూ మోసం చేస్తున్నదెవరో తనకు తెలిసిందంటూ చెప్పడంతో లాస్య నీళ్లు నమిలింది. మరి నిజంగానే తనకు నమ్మకద్రోహం చేస్తుంది లాస్య అన్న విషయం నందుకు తెలిసిందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు