కాళ్లు విరగ్గొడతానన్న తులసి కాళ్ల బేరానికి!?

9 Jun, 2021 13:31 IST|Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 341వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

ఒక్కో మెట్టు ఎదగాలన్న తులసి ఆశయానికి బీజం పడింది. నలుగురు మహిళలను పనిలో చేర్పించుకుని వ్యాపారాన్ని మొదలుపెట్టింది. మరోవైపు జిత్తులమారి లాస్య కుట్రకు నందు అన్యాయంగా బలైపోతున్నాడు. ఎంతో పెద్ద ప్రాజెక్టును దక్కించుకున్న నందు మంచి లాభాలు వస్తాయని ఆశిస్తే చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితికి తానే కారణమంటూ తనలో తానే కుమిలిపోయాడు. మరి నేటి(జూన్‌ 9)ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..


తులసి కుట్టు మిషన్లు తెచ్చి తన వ్యాపారాన్ని మొదలు పెట్టింది. ఆమె అత్త అనసూయ అయిష్టంగానే తులసిని ఆశీర్వదించింది. మూడు మిషన్లు మూడు వందల మిషన్లుగా మారాలని, వ్యాపారంలో వృద్ధి సాధించాలని శృతి ఆకాంక్షించింది. ఇక మొదటి రోజే తులసి పగలూరాత్రీ తేడా లేకుండా కష్టపడింది. ఏ చిన్న పొరపాటు కూడా ఉండకూడదని అన్నీ దగ్గరుండి చూసుకుంది.

మరోవైపు పూటుగా తాగి వచ్చిన నందు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేశానని లాస్యకు తెలిపాడు. కానీ తులసి వ్యాపారం మొదలు పెట్టిందని, తానేమో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తాగి తూలుతున్నానని బాధపడ్డాడు. అసలు ఈ స్థితికి వచ్చేలా నన్ను మోసం చేసింది ఎవరో తెలిసిపోయిందనగానే లాస్య గుండె ఝల్లుమంది. అంతలోనే దీనికంతటికీ కారణం తానే అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.

ఇక అంకిత పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. స్నేహితురాలితో సరాదాగా ఫోన్‌ మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో కంగారుపడ్డ ఆమె తల్లి డాక్టర్‌కు కబురుపెట్టింది. ఇంటికి వచ్చి అంకితను పరీక్షించిన వైద్యురాలు అంకిత ఎక్కువగా టెన్షన్‌ పడటం వల్లే ఇలా అయ్యిందని చెప్పింది. మరీ ఆలస్యం చేస్తే ఆమెకు అబార్షన్‌ చేయడానికి కూడా ఆస్కారం ఉండదని హెచ్చరించింది.

తులసి చీదరించినా, ఛీ కొట్టినా లాస్య తన బుద్ధి పోనిచ్చుకోలేదు. ఫైల్‌ మీద సంతకం పెట్టమంటూ మరోసారి తులసి ఇంటి గడప తొక్కింది, అంతేకాదు ఫైల్‌ మీద సంతకం పెట్టమంటూ డిమాండ్‌ చేసింది. దీంతో ఆమె మీద చిర్రుబుర్రులాడిన తులసి.. ఈ ఇంట్లో అడుగు పెడితేనే కాళ్లు విరిగి చేతిలో పెడ్తాను అని చెప్పినదాన్ని సంతకం ఎలా చేస్తాననుకున్నావు అని మండిపడింది. సంతకం పెట్టకపోతే నందుకు తన కుటుంబ సభ్యులను శాశ్వతంగా దూరం చేస్తానని వార్నింగ్‌ ఇచ్చింది. మరి ఆమె వార్నింగ్‌కు తులసి భయపడుతుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!

చదవండి: ‘శ్రుతీ.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు