Intinti Gruhalakshmi: దివ్య మిస్సింగ్‌, షాక్‌లో తులసి!

10 May, 2021 14:35 IST|Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 315 ఎపిసోడ్‌ ప్రత్యేకం

లాస్యను తన భర్తకు దూరం చేయాలన్న తులసి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. మరోవైపు జరిగే ప్రతి విషయానికి తులసిని దోషిగా నిరూపించాలన్న లాస్య ప్లాన్‌ మాత్రం పర్ఫెక్ట్‌గా వర్కవుట్‌ అవుతోంది. మెడిసిన్‌ చదవాలన్న దివ్య కలకు ఆదిలోనే అడ్డంకులు సృష్టించింది. శశికళను రంగంలోకి దింపి తను అనుకున్నది జరిగేలా చూసుకుంది. తులసి మీద నందుకు ద్వేషం కలిగేలా చేసి, ఆ ఇంటిని రణరంగంగా మలిచాకే మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెడతానని ఫిక్సయింది లాస్య. మరి నేటి(మే 10) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చదివేయండి..

కన్నకూతురును చదివించి తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాలనుకున్నాడు నందు. కానీ ఆ డబ్బులు దివ్య చదువుకు ఖర్చవడం లాస్య, భాగ్యలకు అస్సలు ఇష్టం లేదు. దీంతో వీరిని ఎలా ఆపాలా అని పన్నాగం పన్ని శశికళను రంగంలోకి దింపారు. డబ్బు కోసం ప్రాణాలను సైతం తీసే ఆమెను నందు ఇంటికి ఉసిగొల్పారు. సరిగ్గా అప్పుడే మెడిసిన్‌ ఫీజు కట్టేందుకు వెళ్తున్న నందు ఆమెను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. తన అప్పు, వడ్డీని తీర్చడం పక్కనపెట్టి బిడ్డ చదువుకు డబ్బులు ఖర్చుపెట్టబోతున్నాడని తెలిసి అగ్గి మీద గుగ్గిలమైంది శశికళ.

నాకు వడ్డీ ఇవ్వాలన్న సంగతి గుర్తులేదా? అని నిలదీసింది. ఇప్పుడు కూతురి మెడిసిన్‌ సీటుకు ఫీజు కట్టాలని, తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కాస్త ఆలస్యంగా ముట్టజెప్తానని నందు అభ్యర్థించాడు. కానీ ఆమె ఏదీ చెవికెక్కించుకోలేదు. డబ్బులిస్తేనే గడప దాటుతావు, లేదంటే ఈడనే శవంలా మారుతావు అని గన్‌ ఎక్కుపెట్టి బెదిరించింది. దీంతో భయపడిపోయిన నందు చేసేదేం లేక, ఆమెకు ఎదురు తిరగలేక ఆమెకివ్వాలసిన డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఇక లాస్య పాచిక పారడంతో ఆమె కన్నా భాగ్య ఎక్కువగా సంతోషపడిపోయింది. అంతేకాగు, నువ్వు లేకపోతే బావగారు ఎంత కష్టపడుతున్నారో తెలిసొచ్చేలా చేస్తానని లాస్యకు హామీ ఇచ్చింది.

ఇదిలా వుంటే తన భర్త తల దించుకోవడం ఎప్పుడూ చూడలేదని విలవిల్లాడిపోయింది తులసి. అది కూడా ఓ ఆడదాని ముందు తల దించాల్సిన పరిస్థితి రావడమేంటని ఆవేదన చెందింది. మరోవైపు దివ్య తన మెడికల్‌ సీటు పోయినట్లేనని దిగులు పడింది. తన కలలు కళ్ల ముందే కూలిపోతున్నాయని డిప్రెషన్‌కు లోనైంది. కూతురి మనసులోని భావాలు అర్థమైన తులసి.. ఆఖరు నిమిషం వరకు ఓపిక పట్టమ్మా అని బుజ్జగించింది. తన ఒడిలో పడుకోబెట్టి నిద్రపుచ్చింది. కానీ తెల్లారేసరికి దివ్య కనిపించకుండా పోయింది. దీంతో నందు మరోసారి తులసి మీద నిప్పులు చెరిగాడు. కూతురును చూసుకునే బాధ్యత కూడా లేదా? అని చీవాట్లు పెట్టాడు. మరి దివ్య ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? అన్న విషయాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే!

చదవండి: OTTకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు