Intinti Gruhalakshmi: లాస్యను పక్కన పడేసిన నందు!

18 May, 2021 13:38 IST|Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 322వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

మాధవి పుట్టింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నందు ఇంట్లో ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాక, ఆమె కన్నీళ్లను చూడలేక సతమతమవుతున్నారు ఇంటిసభ్యులు. దీనికి పరిష్కారం వెతికేందుకు ఇంటిల్లిపాది ఆలోచిస్తుంటే విడాకులకే సై అంటున్నాడు మోహన్‌. ఈ క్రమంలో అతడు విడాకుల పత్రాలు తీసుకుంటూ నేరుగా నందు ఇంటికే వచ్చాడు. ఇంటి కోడలికి అన్యాయం జరుగుతుంటే లేపని నోరు ఇప్పుడెందుకు లేస్తుందని ప్రశ్నిస్తూ అందరి నోరు మూయించాడు. ఈ క్రమంలో నేటి(మే 18) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..

మాధవి సంతకం కోసం నందు ఇంట్లో అడుగు పెట్టాడు మోహన్‌. నువ్వు నా కూతురికి ద్రోహం చేస్తుంటే కడుపు రగిలిపోతుందని అతడిని తిట్టిపోసింది గయ్యాళి అత్త. ఆమె మాటలకు అసహనం వ్యక్తం చేసిన మోహన్‌ మరి ఇదే స్థానంలో మీ కోడలు ఉన్నప్పుడు ఇంత కోపం రాలేదేంటని అడిగాడున్‌. అయినా వాదనలు అనవసరమని 24 గంటల్లో సంతకం పెట్టు అంటూ విడాకుల పేపర్‌ను ఆమె చేతిలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తనకు విడాకులు తథ్యమేనా అని భయపడిపోయిన మాధవి కన్నీరుమున్నీరుగా విలపించింది. కట్టుకున్న భర్త తనను వద్దంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలిసిన తులసికి ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు.

దీంతో తన చెల్లెలిని ఓదార్చడానికి వెళ్లిన నందుకు భంగపాటు ఎదురైంది. నువ్వు చేస్తుంది కూడా తప్పే అంటూ కాళికా అవతారం ఎత్తింది. విడాకుల విషయంలో నీ చెల్లెలికి ఒక న్యాయం, నీ భార్యకు ఒక న్యాయమా అని సూటిగా ప్రశ్నించింది. ఈ మాటలు విని నందు తల్లి అగ్గి మీద గుగ్గిలమైంది. నీ మొగుడిని హద్దుల్లో పెట్టుకోవడం చేతకాక నా కొడుకును అంటావేంటి అని నందు తల్లి మాధవి మీద విరుచుకుపడింది. నా భర్త, అన్నయ్య ఇద్దరూ చేస్తున్న తప్పు ఒకటే కదా అని గుర్తు చేసింది. అసలు నీ వల్లే అన్నయ్య ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్నాడంటూ తల్లిని ఏకిపారేసింది మాధవి.

మరోవైపు ఫారిన్‌ వెళ్తున్నందుకు అంకిత సంతోషపడుతుంటే అభి మాత్రం లోలోపలే ఉడికిపోయాడు. నీ వల్ల మనసు చంపుకుని, మీ తల్లిదండ్రుల ముందు తల దించుకుంటున్నాను అని ఆవేదన చెందాడు. మన కోసమే ఇదంతా చేశానన్న అంకిత మాటలకు మధ్యలోనే అడ్డు చెప్తూ కేవలం నీ సంతోషం కోసమే ఫారిన్‌కు వెళ్లడానికి ఒప్పుకున్నానని తేల్చి చెప్పాడు. దీంతో దిగులు చెందిన అంకిత తను తప్పు చేశానా అని మథనడపడటం ప్రారంభించింది. ఇదిలా వుంటే నందులో మార్పుకు పునాది పడినట్లు కనిపిస్తోంది. లాస్య ఫోన్‌ కాల్‌ను కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పు ఎటువైపు సాగుతుంది? లాస్య దీన్ని ఎలా అడ్డుకుంటుంది? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే!

చదవండి: కోలివుడ్‌లో విషాదం: నటుడు, దర్శకుడి సతీమణి మృతి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు