Intinti Gruhalakshmi: తులసి మీద పగతో రగిలిపోతున్న నందు!

24 May, 2021 12:57 IST|Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 327వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

మమతల కోవెల కలహాలతో విలవిల్లాడుతోంది. చిరునవ్వుకు చోటు లేకుండా గొడవలతో చిగురుటాకులా వణికిపోతోంది. చివరికి ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. నందు తన కుటుంబం కన్నా లాస్యే ఎక్కువ అంటూ ఆమెతో వెళ్లిపోయాడు. అందుకు గల కారణమేంటి? అసలు నేటి(మే 24) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

సహనానికి మారుపేరుగా ఉండే తులసి ఈరోజు ఉగ్రరూపం చూపించింది. తను కిమ్మనకుండా కూర్చుంటే సమస్య మరింత పెద్దదవుతుందని గ్రహించిన ఆమె కాళికా అవతారం ఎత్తింది. పామును చేరదీసి పాలు పోస్తే అది విషం కక్కుతుందని తెలిసినా నిన్ను ఇంట్లో ఉంచి ఆదరించానని లాస్య మీద ఫైర్‌ అయింది. భార్యాభర్తల మధ్యలోకి వచ్చిన నిన్ను వేరే పేరుతో పిలుస్తారని ఆమెను చీదరించుకుంది. మీరు బరితెగించింది, తాను భరించింది ఇక చాలు అని నందుకు తులసి తేల్చి చెప్పింది. సహనం చచ్చిపోయిందని, ఓపిక నశించిందని ఇంకా భరించడం తన వల్ల కాదని కుండ బద్ధలు కొట్టింది. లాస్య ఇంటి గడప బయట ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడింది. అయినా సమస్యను తోసిపడేస్తే ఎవరికీ ఏ దిగులూ ఉండదంటూ తులసి ఏకంగా లాస్య చేయి పట్టుకుని ఆమెను ఇంటి బయటకు గెంటేసింది.

ఊహించని పరిణామానికి షాకైన నందు లాస్యతోనే తన సంతోషమంటూ ఆమెతో పాటు వెళ్లిపోతానని హెచ్చరించాడు. అయినప్పటికీ వెనక్కు తగ్గని తులసి ఏదేమైనా లాస్య మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని కరాఖండిగా చెప్పేసింది. దీంతో నందు, లాస్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. దివ్యను కూడా వెంటరమ్మని కోరాడు, కానీ ఆమె అందుకు నిరాకరించింది. మీరు లాస్యతో ఉంటే చూడలేనని వెనకడుగు వేసింది.

ఇక అయినవాళ్లెవరూ తనకు మద్దతుగా లేరని అర్థమైన నందు లాస్యను తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయాడు. దీంతో నందు తల్లి అనసూయ ఆవేశంతో తులసిని నానా మాటలు అంది. తన కొడుకు ఇల్లొదిలి వెళ్లడానికి కారణం నువ్వే అంటూ తులసిని నిందించింది. నీ తల్లి పెంపకం ఇలా తగలడింది కాబట్టే ఇలా తయారయ్యావని విరుచుకుపడింది. దీంతో చిర్రెత్తిపోయిన తులసి ఇంకొక్క మాట మాట్లాడితే బాగోదు అని ఆమెకు వార్నింగ్‌ ఇచ్చింది. కొడుకును దారిలో పెట్టడం చేతకాదు కానీ వేరేవాళ్ల పెంపకం గురించి మాట్లాడతారేంటని చురకలు అంటించింది. దీంతో అనసూయ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. 

మరోవైపు తులసి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోయారు నందు, లాస్య. తనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయంచుకున్నారు. అందులో భాగంగా నందు నివాసం ముందు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని దిగుదామని లాస్య చెప్పిన ప్లాన్‌కు నందు సై అన్నాడు. ఇంతకింతా అనుభవించేలా చేస్తానని పగతో రగలిపోతున్నాడు. మరి తర్వాత ఏం జరగనుందన్నది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.

చదవండి: Radhe Shyam: లవ్‌ సాంగ్‌ కోసం ముంబైలో సెట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు