సుశాంత్‌ మృతి : దర్యాప్తు ముమ్మరం

2 Aug, 2020 14:59 IST|Sakshi

పట్నా : బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై బిహార్‌ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు సహకరించడంలేదని, కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అందచేయడం లేదని బిహార్‌ పోలీసులు ఆరోపిస్తున్న క్రమంలో పట్నా ఎస్పీ వినయ్‌ కుమార్‌ ముంబైకి పయనమయ్యారు. జులై 14 అర్ధరాత్రి 12.30-12.45 గంటల మధ్య సుశాంత్‌ రూం తలుపును ఓపెన్‌ చేసేందుకు ఆయన స్నేహితుడు, రూమ్మేట్‌ సిద్ధార్థ్‌ పితాని పిలిపించిన తాళాలు తయారుచేసే వ్యక్తి కోసం పట్నా పోలీసులు గాలిస్తున్నారు. కీ మేకర్‌ను గుర్తించామని, త్వరలోనే మొత్తం ఘటనపై అతడిని ప్రశ్నిస్తామని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా బిహార్‌ పోలీసులు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ విషాదాంతం సీన్‌ రీకన్‌స్ర్టక్షన్‌ చేపట్టారు.

సుశాంత్‌ నివాసంలో పనిచేసే ఆయన సిబ్బందిలో పలువురిని సైతం పోలీసులు ప్రశ్నించారు. ఇక దర్యాప్తులో భాగంగా సుశాంత్‌ సిబ్బందిలో ఒకరు యువనటుడి గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి గురించి సంచలన విషయాలు వెల్లడించారు. సుశాంత్‌ బాంద్రా నివాసంలో రియా ఉన్నప్పుడు అన్ని విషయాలూ ఆమె కనుసన్నల్లోనే సాగేవని సుశాంత్‌ వద్ద పనిచేసే స్వీపర్‌ తెలిపారు. ఆమె అనుమతి లేకుండా సుశాంత్‌ రూంలోకి ఏ ఒక్కరికీ ప్రవేశం ఉండేది కాదని చెప్పారని తెలిసింది. సుశాంత్‌ గదిని శుభ్రపరచాలా, లేదా అనేది కూడా ఆమే నిర్ణయించేవారని చెప్పారు. జూన్‌ 14న సుశాంత్‌ విషాదాంతంలో తొలిసారి సుశాంత్‌ మృతదేహాన్ని చూసిన ఆయన స్నేహితుడు, రూమ్మేట్‌ సిద్ధార్థ్‌ పితాని ఆచూకీపైనా బిహార్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, సుశాంత్‌ మరణానికి ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. చదవండి : ‘రియా చక్రవర్తి జాడ తెలియలేదు’

మరిన్ని వార్తలు