Mythri Movie Makers: మైత్రి మూవీ మేకర్స్‌పై ఐటీ సోదాలు.. పుష్ప-2 షూటింగ్ ఆపేశారా!

20 Apr, 2023 18:37 IST|Sakshi

అక్రమమార్గాల్లో పెట్టుబడులు తీసుకోవడం, పన్ను ఎగవేత వంటి ఆరోపణలపై మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ కార్యాలయం, ప్రముఖ సినీదర్శకుడు సుకుమార్‌ ఇళ్లలో గురువారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. భారీ బడ్జెట్‌ సినిమాల పెట్టుబడుల కోసం విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నార­న్నది ప్రధాన ఆరోపణ. జీఎస్టీ చెల్లింపులు సైతం సక్రమంగా చేయకపోవడంతోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలిసింది.

నగరంలో బుధ­వారం ఉదయం నుంచి ప్రారంభమైన సోదాలు గురువారం కూడా కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్‌ ఆఫీస్‌తోపాటు సుకుమార్‌ ఇళ్లు, మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ప్రతినిధులు రవిశంకర్, నవీన్‌ ఇళ్లలోనూ ఐటీ బృందాలు తనిఖీ చేసినట్టు తెలిసింది. ముంబైకి చెందిన ఓ ఫైనాన్సియర్‌ హవాలా మార్గంలో తెచ్చిన డబ్బులను సినిమారంగంలో పెట్టుబడులకు వినియోగిస్తున్నట్టు అందిన విశ్వసనీ­య సమాచారం మేరకు ఐటీ అధికారులు ముంబైలో తనిఖీ చేశారు. అందులో వెలుగుచూసిన కీలకప­త్రాల ఆధారంగా హైదరాబాద్‌లోనూ ఈ సోదాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

రెండురో­జులుగా జరుగుతున్న తనిఖీల్లో ముంబైకి చెందిన ఫైనాన్సియర్లతో చేసుకున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ డీల్స్‌ సైతం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ భారీ బడ్జెట్‌ సినిమాలు నిర్మించేందుకు హవాలా మార్గంలో రూ.వందల కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి దర్శకుడు సుకుమార్‌ పుష్ప–2 సినిమాను నిర్మిస్తున్నారు.

దీంతో ఈ సంస్థకు, సదరు డైరెక్టర్‌కు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సినిమాల్లో వచ్చిన లాభాలు, పన్నుల ఎగవేత ఫలితంగా మిగిల్చిన సొమ్ముతో హైదరా­బాద్‌ నగర శివారుల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి.  ఐటీ అధికారుల బృందాలు ఇప్పటికే పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. రెండురోజుల తనిఖీల్లో లభించిన ఆధారాలను విశ్లేషించిన తర్వాత ఐటీ అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు