కోలీవుడ్‌పై రెండోరోజూ కొనసాగిన ఐటీ దాడులు.. రూ. 13 కోట్లు సీజ్‌

4 Aug, 2022 09:53 IST|Sakshi

సాక్షి, చెన్నై: కోలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ జరిపిన దాడుల్లో రూ.13 కోట్ల కరెన్సీ పట్టుబడింది. అలాగే అనేక అక్రమ లావాదేవీలు వెలుగు చూశాయి. వివరాలు.. సూపర్‌హిట్‌ సినిమాలకు ఫైనా న్స్‌ చేసి, నిర్మించి వందలకోట్లు గడించిన తమిళ సినీరంగ ప్రముఖులు పెద్దఎత్తున ఆదాయపు పన్ను ఎగవేసినట్లు తెలిసింది. ఈ సమాచారంతో ఐటీశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 40 చోట్ల చేపట్టిన సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. చెన్నై, మదురై జిల్లాల్లోని ఫైనాన్షియర్లు అన్బుచెళియన్, జ్ఞానవేల్‌రాజా, ఎస్‌ఆర్‌ ప్రభు, నిర్మాత కలైపులి థాను సంస్థల్లో సుమారు 100 మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

బడా ఫైనాన్షియర్‌గా పేరుగాంచిన అన్బుచెళియన్‌ గోపురం ఫిలిమ్స్‌ పేరున జరిపిన లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అన్బుచెళియన్, అతని సోదరుడు అళగర్‌స్వామి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలకు అవకాశం లేకుండా అనేక చోట్ల సెన్సార్లు అమర్చి ఉండడంతో ఢిల్లీ నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారులు విమానంలో హుటాహుటిన తమిళనాడుకు చేరుకున్నారు. బినామీల పేర్లతో ఇబ్బడిముబ్బడిగా ఆర్జించిన ఆస్తుల పత్రాలను సీజ్‌ చేశారు. ఐదుగురు సినీ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో రూ.13 కోట్ల స్వాధీనం చేసుకున్నారు.   
చదవండి: ప్రస్తుత టాలీవుడ్‌ కష్టాలకు కారణం డైరెక్టర్‌ రాజమౌళి: వర్మ

మరిన్ని వార్తలు