ఐటీ దాడులపై తాప్సీ బాయ్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌​

5 Mar, 2021 16:32 IST|Sakshi

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, హీరోయిన్‌ తాప్సీ పన్ను నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫాంటమ్‌ ఫిల్మ్స్ ప్రమోటర్లు అయిన తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌, దర్శకనిర్మాత విక్రమాదిత్య మోత్వానే, వికాస్‌ బెహల్‌, మధు మంతెనకు సంబంధించిన ఇళ్లలో, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ముంబై, పుణె, ఢిల్లీ, హైదరాబాద్‌లోని మొత్తం 28 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. కాగా పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టగా.. ఈ మొత్తం దాడులకు ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ అనే ప్రొడక్షన్‌ హౌజ్‌ సంస్థ కారణమని అధికారులు గుర్తించారు. ఫాంటమ్ ప్రొడక్షన్‌ సంస్థ కోట్లలో అక్రమ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా తాప్సీ పన్ను ఆదాయాలపై జరుపుతున్న ఐటీ దాడులపై ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మాథియాస్‌ బోయ్‌ స్పందించాడు. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా తాప్సీకి మద్దతుగా నిలిచాడు. ‘ఈ విషయం నన్ను కొంచెం గందరగోళంలో పడేసింది. కొంతమంది గొప్ప అథ్లెట్లకు కోచ్‌గా నేను మొదటిసారిగా ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అయితే ఇటీవల తాప్సీ ఇళ్ళపై ఐటీ శాఖ దాడులు చేయడం ఆమె కుటుంబంపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తోంది. ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులు ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారు. మంత్రి కిరెన్ రిజిజు మీరు దయచేసి ఏదైనా చేయండి’ అంటూ క్రీడా మంత్రి కిరెన్‌ రిజిజును ట్యాగ్‌ చేశాడు.

అయితే మాథియాస్ ట్వీట్‌లో క్రీడా మంత్రి కిరెన్ రిజిజు తీవ్రంగా సమాధానం ఇచ్చారు. ‘చట్టం అత్యున్నతమైనది. దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. ఈ విషయం నాకు, మీకు చెందినది కాదు. మేము మా వృత్తిపరమైన విధులకు కట్టుబడి ఉండాలి’. అని రిప్లై ఇచ్చారు. కాగా మాథియాస్ బో డెన్మార్క్‌కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు. అతను తాజాగా భారతదేశ బ్యాడ్మింటన్ కోచ్‌గా ఉన్నారు. అతను ప్రస్తుతం స్విస్ ఓపెన్ కోసం స్విట్జర్లాండ్‌లోని భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లతో ఉన్నాడు.

చదవండి: బాయ్‌ఫ్రెండ్ గురించి నోరువిప్పిన తాప్సీ

హైదరాబాద్‌లో వెలుగులోకి రూ.400 కోట్ల నల్లధనం

అనురాగ్ కశ్యప్‌, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత

మరిన్ని వార్తలు