అప్పుల వల్ల సొంతిల్లు కోల్పోయాను: జాకీ ష్రాఫ్‌

23 Jun, 2021 11:40 IST|Sakshi

మోడల్‌గా కెరీర్‌ మొదలు పెట్టి 'హీరో' సినిమాతో వెండితెరపై కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు జాకీ ష్రాఫ్‌. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన హీరోగా, విలన్‌గా పలు హిందీ చిత్రాల్లో నటించాడు. అప్పుడప్పుడూ ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. తాజాగా ఆయన తన జీవితంలో చవిచూసిన కష్టనష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

"ఏదో ప్రయత్నించాను, కానీ ఇంకేదో జరిగి తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది, అప్పులబారిన పడ్డాను. ప్రతి ఒక్కరికీ రుణాలను చెల్లించి కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తపడ్డాను. అయినా వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. కొన్నిసార్లు పై నుంచి కిందపడటం, కింద నుంచి మళ్లీ పైకి ఎదగడం జరుగుతూ ఉంటాయి. కానీ నా కొడుకు టైగర్‌ ష్రాఫ్‌ మాత్రం నేను కోల్పోయిన ఇంటిని తిరిగి నాకు అప్పజెప్తానని మాటిచ్చాడు. తన తల్లిదండ్రులకు ఇల్లు ఉండాలన్న వాడి ఆలోచనకు ముచ్చటపడిపోయాను. నా పిల్లలను చూస్తుంటే గర్వంగా అనిపించింది"

"నిజానికి ఆ ఇంటిని తిరిగి తీసుకోవడం నా భార్యకు అస్సలు ఇష్టం లేదు. పోయిందేదో పోయింది.. ఇక దాని గురించి పట్టించుకోకు అని చెప్తూ ఉండేది. కానీ మాకిష్టమైన ఆ ఇంటిని తిరిగివ్వాలని వాళ్లు డిసైడ్‌ అయ్యారు. అందుకోసం చాలా కష్టపడ్డారు. మా పిల్లలెప్పుడూ మమ్మల్ని సంతోషంగా ఉంచాలనుకున్నారు" అని చెప్పుకొచ్చాడు. కాగా అప్పులపాలైన సమయంలో జాకీ తన ఇంట్లోని ఒక్కో వస్తువును అమ్ముతూ ఆఖరికి తన బెడ్‌ను కూడా అమ్మేసి కటిక నేల మీద పడుకున్నాడు. తన జీవితంలో అవి అత్యంత దుర్దినాలని గతంలో ఆయనే స్వయంగా పేర్కొన్నాడు.

ప్రస్తుతం జాకీ ష్రాఫ్‌ 'ఓకే కంప్యూటర్‌' అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఇందులో ఆయన ఎలాంటి దుస్తులు లేకుండా నగ్నంగా కనిపించాడు. సైన్స్‌ని వ్యతిరేకించే వ్యక్తిగా ఆకులు, పువ్వులను శరీరానికి కప్పుకునే పాత్రలో ఆకట్టుకున్నాడు.

చదవండి: ఆ నటుడిని హాఫ్‌ బాయిల్‌ అన్న గూగుల్‌!

మరిన్ని వార్తలు