Jacqueline Fernandez: శ్రీలంక సంక్షోభంపై జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పందన.. ఎమోషనల్‌గా పోస్ట్

4 Apr, 2022 20:13 IST|Sakshi

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తన స్వదేశమైన శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్‌గా సుదీర్ఘమైన నోట్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధన కొరతతో పోరాడుతోంది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు విలవిల్లాడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నారు లంకేయులు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఇంటిన చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం గురించి శ్రీలంక దేశ జెండాను షేర్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది. 

ఈ పోస్టులో జాక్వెలిన్‌ 'శ్రీలంక యువతిగా నా దేశం, నా దేశ ప్రజలు ఏం అనుభవిస్తున్నారో చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అభిప్రాయాలను విని విసిగిపోయాను. నేను చెప్పేది ఏంటంటే.. మీ కంటికి కనిపించిన దాని ఆధారంగా ఈ సంక్షోభానికి కారణమంటూ ఏ ఒక్కరినీ తొందరపడి దూషించకండి. శ్రీలంక ప్రజలకు కేవలం సానుభూతి, మద్దతు అవసరం. అక్కడి పరిస్థితి గురించి తప్పుగా మాట్లాడం కంటే వారి క్షేమం కోసం 2 నిమిషాలు మౌన ప్రార్థన చాలు వారికి మిమ్మల్ని మరింత దగ్గర చేయడానికి. అతి త్వరలోనే నా దేశం, దేశప్రజలు శాంతియుతంగా ఈ పరిస్థితి నుంచి బయటపడతారని నేను ఆశిస్తున్నాను. ఇందుకోసం శ్రమించే వారికి అపారమైన శక్తి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.' అని రాసుకొచ్చింది.
 

మరిన్ని వార్తలు