జైలర్‌గా రజనీ, ఖైదీగా చిరు.. కేరాఫ్‌ చెరసాల

24 Jun, 2022 03:33 IST|Sakshi

జైలర్‌ డ్యూటీ చేయనున్నారు రజనీకాంత్‌.. ఖైదీగా జైలుకి వెళ్లారు చిరంజీవి.. కార్తీ కూడా ఖైదీగా జైలులో ఉంటారు... రణ్‌దీప్‌ హుడా కూడా ఖైదీయే.. ఇవన్నీ సినిమా జైళ్లు. ఈ సినిమాల్లోని కథలు కేరాఫ్‌ చెరసాల అంటూ జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. ఇక ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.

రజనీకాంత్‌ ఈ మధ్య చేసిన చిత్రాల్లో ‘దర్బార్‌’ ఒకటి. ఇందులో కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా చెలరేగిపోయిన రజనీ తాజాగా జైలర్‌గా మారారు. రజనీ హీరోగా రూపొందనున్న 169 చిత్రానికి ‘జైలర్‌’ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకుడు. కాగా.. ఖైదీలుగా ఉన్న గ్యాంగ్‌స్టర్స్‌ జైలు నుంచి తప్పించుకోవడానికి వేసిన మాస్టర్‌ ప్లాన్‌ని జైలర్‌ ఎలా అడ్డుకున్నాడు? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం.

జైలర్‌ పాత్రలో రజనీని ఫుల్‌ మాస్‌గా చూపించనున్నారట నెల్సన్‌. ఇక రజనీ జైలర్‌ అయితే చిరంజీవి ఖైదీగా కనిపించనున్నారు. అయితే కాసేపు మాత్రమే. మోహన్‌లాల్‌ మలయాళ ‘లూసిఫర్‌’కి  రీమేక్‌గా చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘గాడ్‌ ఫాదర్‌’లోనే ఈ జైలు సీన్స్‌ ఉన్నాయి. ప్రత్యర్థులు వేసిన నిందలతో ఖైదీగా చిరంజీవి జైలుకి వెళతారు. ఆ మధ్య ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌ లొకేషన్‌కి పవన్‌ కల్యాణ్‌ వెళ్లిన ఫొటో ఒకటి బయటికొచ్చింది.

అందులో చిరంజీవి వేసుకున్న ఖైదీ దుస్తుల్లో చొక్కా పై 786 అని కనిపిస్తుంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. అటు కోలీవుడ్‌వైపు వెళితే... తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న తమిళ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్‌’. ఇందులో కార్తీ తండ్రీ కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. తండ్రి పాత్రధారి ఖైదీగా కనిపిస్తారని సమాచారం. కొడుకు పోలీసాఫీసర్‌.  పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది.

కార్తీ నటించిన గత తమిళ చిత్రాలు తెలుగులోనూ విడుదలైనట్లే  ‘సర్దార్‌’ కూడా తెలుగులోనూ విడుదలవుతుంది. ఇక హిందీ పరిశ్రమకు వెళ్తే... ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’ చిత్రం గురించి చెప్పుకోవాలి. స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక్‌ దామోదర వీర్‌ సావర్కర్‌ బయోపిక్‌గా రూపొందుతున్న చిత్రం ఇది. వీర్‌ సావర్కర్‌ పాత్రను రణ్‌దీప్‌ హుడా చేస్తున్నారు. నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకుడు. వీర్‌ సావర్కర్‌ అండమాన్‌ జైలులో 20 ఏళ్లు గడిపారు. ఈ బయోపిక్‌లో జైలు జీవితానికి సంబంధించిన సీన్లు ఉంటాయి.

ఇవే కాదు.. జైలు బ్యాక్‌డ్రాప్‌లో మరి కొన్ని చిత్రాలున్నాయి. కథ ఏదైనా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటే కాసుల వర్షం షురూనే.
 

మరిన్ని వార్తలు