ఆస్కార్‌ బరిలోకి ‘జల్లికట్టు’.. సినిమా కథ ఇదే

25 Nov, 2020 17:40 IST|Sakshi

ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘జల్లికట్టు’కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్‌ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. ఉత్తమ అంతర్జాతీయ భాషా చిత్రాల కెటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది. ఫ్లిల్మ్  మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. మొత్తం 26 చిత్రాలకు గాను ఈ  సినిమా  ఆస్కార్ బరిలోకి ఎంపిక కావడం విశేషం. 14 మంది సభ్యులతో కూడిన జ్యురీ జల్లికట్టు మూవీని సెలెక్ట్ చేసినట్టు రాహుల్  తెలిపారు. ఈ చిత్రానికి  సంబంధించిన లొకేషన్,  టెక్నీకల్, హ్యూమన్ యాస్పెక్ట్స్ అన్నీ దీన్ని ఇందుకు అర్హమైనవిగా నిలబెట్టాయని ఆయన చెప్పారు. మ‌నుషులు, జంతువుల మ‌ధ్య బావోద్వేగ పూరిత స‌న్నివేశాల‌ను కళ్లకు క‌ట్టిన‌ట్టు చూపించారని, అందకే ఈ సినిమాను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

జల్లికట్టు కథేంటి
లిజో జోస్  పెలిసెరి దర్శకత్వంలో ఆంటోని వర్గీస్‌, చెంబన్‌ వినోద్‌ జోసే, సబుమోన్‌ అబ్దుసామద్‌ శాంతి బాల చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో.. ఓ కుగ్రామంలో ఓ దున్న సృష్టించిన విన్యాసాలను అద్భుతంగా చూపించారు.  కేరళలోని ఓ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలందరికి గొడ్డు మాంసం అంటే ఇష్టం. గొడ్డుమాంసం లేనిదే వారికి ముద్ద దిగదు. ఆంటోనీ అనే వ్యక్తి  ఉరందరికి బీఫ్‌ సరఫరా చేస్తుంటాడు. అతను తెచ్చి అమ్మె అడవి దున్న మాంసం అంటే అక్కడి వాళ్లందరికి పిచ్చి. అలా ఓరోజు.. అడ‌వి దున్న ని క‌బేళాకి త‌ర‌లించి, దాని మాంసం విక్ర‌యిద్దాం అనుకునేలోపు.. అది త‌ప్పించుకుంటుంది. అడ‌విని ధ్వంసం చేస్తూ, మ‌నుషుల్ని గాయ‌ప‌రుస్తూ.. దాగుడుమూత‌లు ఆడుతుంది. దాన్ని పట్టుకునేందుకు ఊరంతా ఏకమై తిరుగుతారు. ఎలాగైనా దాన్ని చంపి మాంసం తలా ఇంత పంచుకోవాలనుకుంటారు. మరి ఆ దున్న వారికి దొరికిందా? ఈలోపు ఏం జ‌రిగింది? ఎంత న‌ష్ట‌ప‌ర‌చింది? అన్న‌దే క‌థ‌.

మరిన్ని వార్తలు