Jamuna Death: అందాల చందమామ.. తెలుగు తెర ‘సత్యభామ’

27 Jan, 2023 09:38 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణించినవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే తమదైన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సీనియర్‌ హీరోయిన్‌ జమున ఒకరు. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ.. తెలుగింటి అమ్మాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

దాదాపు 30 ఏళ్ల పాటు హీరోయిన్‌గా రాణించిన జమున..వందలాది పాత్రలు పోషించింది. కానీ ‘వినాయకచవితి’ చిత్రంలో పోషించిన సత్యభామ పాత్రే జమునకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘శ్రీకృష్ణ తులాభారం’లో కూడా ఆమె అదే పాత్ర పోషించి మెప్పించింది. ఇప్పటికీ తెలుగు వాళ్లకి సత్యభామ అంటే జమునే. అలా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున(86)..నేడు(జనవరి 27) ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఆమె మరణ వార్త విన్న అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

1937లో కర్నాటక రాష్ట్రంలోని హంపీలో జమున జన్మించింది.  ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆమె బాల్యంలోనే ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చింది. జమున బాల్యం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున అసలు పేరు జనాబాయి. కానీ జన్మనక్షత్రం రీత్యా ఏదైనా నదిపేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో.. ఆమె పేరు మధ్యలో ‘ము’ అక్షరం చేర్చడం జరిగింది. అలా ఆ విధంగా ఆమె పేరు జమునగా మారింది. 

► జమునకు చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే చాలా ఇష్టం. స్కూల్‌లో చుదువుకునే సమయంలో నాటకాల్లో నటించింది.  తెనాలీ సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీరాజ్యపతనం అనే నాటిక ప్రదర్శనకోసం నటుడు జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపికచేసి తీసుకెళ్లారు.అలా ఆమె ఓ నాటక ప్రదర్శనలో దర్శకుడు గరికపాటి రాజారావు ఆమెను చూశారు. తన సినిమాలో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చారు. అలా ‘పుట్టిల్లు’ సినిమాతో కథానాయికగా జమున సినీరంగ ప్రవేశం చేశారు.

► తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత  అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్యలతోబాటు ఇతర ప్రముఖ నటులతో కలిసి వందలాది చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆమె పోషించిన సత్యభామ పాత్రే ఆమెను మరింతగా పేరుప్రఖ్యాతలు వచ్చేలా చేసింది. సత్యభామ పాత్రను ఆ స్థాయిలో పోషించినవారెవరూ లేరు .. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే.

 తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల సినిమాల్లో కూడా నటించింది. ఆ చిత్రాలు కూడా ఘనవిజయాలనే అందుకున్నాయి.  ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.

► 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు