నవ్వులు పూయించిన ‘జాతి రత్నాలు’

11 Mar, 2021 15:12 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : జాతి రత్నాలు
జానర్‌: కామెడీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు :  నవీ‌న్ పోలిశెట్టి, ఫారియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, బ్రహ్మానందం, నరేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు
నిర్మాణ సంస్థ : స్వప్న సినిమాస్‌
నిర్మాతలు :  నాగ్‌ అశ్విన్‌ 
దర్శకత్వం : అనుదీప్
సంగీతం : రథన్
సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహర్ కెమెరా 
ఎడిటింగ్ : అభినవ్ రెడ్డి దండ
విడుదల తేది : మార్చి 11, 2021

కొన్ని సినిమాలపై విడుదలకు ముందే పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉంటాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్‌ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమానే ‘జాతి రత్నాలు’. ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచే దానిపై చర్చ మొదలయింది. టైటిల్‌ డిఫరెంట్‌గా ఉండడం, ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించడంతో ‘జాతి రత్నాలు’మూవీపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలు సూపర్‌ హిట్‌ కావడంతో ఆ అంచనాలు తారాస్థాయికి పెరిగాయి.  ఇక ప్రొమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేసారు. ఇన్ని అంచనాల మధ్య మహాశివరాత్రి కానుకగా గురువారం(మర్చి 11)న విడుదలైన ‘జాతిరత్నాలు’ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ
 శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి) మెదక్‌ జిల్లా జోగిపేట గ్రామానికి చెందిన లేడీస్ ఎంపోరియం ఓనర్ (తనికెళ్ళ భరణి) కొడుకు. అతనికి ఇద్దరు స్నేహితులు రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి). ఈ ముగ్గురు అల్లరిచిల్లరగా తిరుగుతుంటారు. వీరంటే ఊళ్లో వాళ్లకి చిరాకు. తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియంలో శ్రీకాంత్‌ పని చేయడంతో అతన్ని అందరూ‘లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్’అని పిలుస్తుంటారు. అలా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని, హైదరాబాద్‌కి వెళ్లి ఉద్యోగం చేస్తానని బ్యాగు సర్దుకొని సిటీకి బయలుదేరుతాడు. అతనితో పాటు ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్‌ కూడా హైదరాబాద్‌కు వస్తారు. అక్కడ శ్రీకాంత్‌ చిట్టి (ఫరియా)తో ప్రేమలో పడతాడు. కట్‌చేస్తే.. ఈ ముగ్గురు అనుకోకుండా ఓ హత్య కేసులో అరెస్ట్‌ అవుతారు. అసలు ఆ హత్య కేసుకి, ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి ముగ్గురు ఎలా తప్పించుకున్నారు? అనేదే మిగతా కథ.

నటీనటులు
ఈ సినిమా మొత్తం నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ పాత్రల చుట్టే తిరుగుతంది. అమాకత్వం గల శ్రీకాంత్‌  పాత్రలో నవీన్‌ ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. అమాయకత్వంలోనే హీరోయిజం చూపించి మెప్పించాడు. ఇక ప్రియదర్శి, రామకృష్ణ ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా చిట్టి పాత్రలో క్యూట్‌గా కనిపించింది. నటన పరంగా కూడా పర్వాలేదు. మురళీశర్మ రొటీన్ గానే కనిపించాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ తమదైన కామెడీ పంచ్‌లతో నవ్వించారు.

విశ్లేషణ
అమాయకత్వంతో కూడిన కామెడీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. 'జాతిరత్నాలు' అలాంటి చిత్రమే. ముగ్గురు అమాయకులు‌.. ఒక సీరియస్‌ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. సినిమా మొత్తాన్ని వినోదభరితంగా మలిచాడు దర్శకుడు అనుదీప్‌. సింపుల్ కథను మెయిన్ లీడ్ పై అశ్లీలం లేని కామెడీతో బాగా డీల్ చేసాడు. అలాగే తాను రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్  చివరి వరకూ ప్రేక్షకుడికి బోర్‌ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కొచ్చి సన్నివేశాల్లో కామెడీ మరీ ఓవర్‌ అయినట్లు అనిపిస్తుంది. అలాగే కేసు విచారణను డీల్ చేసిన విధానం కూడా అంత కన్విన్స్‌గా అనిపించదు. ఎక్కడో లాజిక్స్ మిస్సయ్యారనే భావన కలుగుతుంది. అలాగే సెకండాఫ్లో కథ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.  ఫస్టాప్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు, పంచ్‌ డైలాగ్స్‌మంచి ఫన్ ను జెనరేట్ చేస్తాయి. ముఖ్యంగా బ్రహ్మానందంతో వచ్చే కోర్టు సీన్‌ అయితే ఈ సినిమాకు హైలెట్‌ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మరో జాతి రత్నం సంగీత దర్శకుడు రథన్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. సిద్దం మనోహర్ కెమెరా పనితనం కూడా బాగుంది.  ఎడిటర్‌ అభినవ్ రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

 ప్లస్ పాయింట్స్ 
నవీన్, రాహుల్, ప్రియదర్శి నటన
అశ్లీలం లేని కామెడీ
రథన్‌ సంగీతం 

మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లోపించడం
సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు

Rating:  
(3/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు