Jaya Prakash Reddy Facts: ఆ వేషంతో నాన్నకు సినిమా అవకాశాలు పెరిగాయి

22 Aug, 2021 10:50 IST|Sakshi

యామిరా యామి చేస్తన్నావు.. అంటూ రాయలసీమ మాండలికంతో గుర్తింపు తెచ్చుకున్నారు..
చిన్నచిన్న పాత్రల నుంచి ఉత్తమ విలన్, ఉత్తమ కమేడియన్‌ స్థాయికి చేరుకున్నారు..
స్కూల్‌ టీచర్‌గా రజతోత్సవం చేసుకున్నారు..
కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల వారితో సంబంధం కలుపుకున్నారు..
గొప్ప స్థాయికి చేరినా, సాధారణమైన జీవితం గడిపిన తన తండ్రి 
జయప్రకాశ్‌ రెడ్డి గురించి కుమారుడు విపుల్‌ చంద్రప్రకాష్‌ రెడ్డి జ్ఞాపకాలు...

తాడిపర్తి సాంబిరెడ్డి, సామ్రాజ్యమ్మ దంపతులకు నాన్న మొదటి సంతానం. నాన్నకు ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు. నాన్న గుంటూరులో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి, ఇంగ్లీషు, లెక్కల మాస్టారుగా గవర్నమెంట్‌ స్కూల్‌లో పాతిక సంవత్సరాలు పనిచేశారు. నాన్నది అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌. అమ్మ పేరు భాగ్యలక్ష్మి. నాన్నగారికి మేం ఇద్దరు పిల్లలం. అక్క మల్లిక, నేను. చదువు విషయంలో లిబర్టీ ఇచ్చారు. నేను వ్యాపారంలో గుంటూరులో స్థిరపడ్డాను. అక్క బీఎస్సీ చదివింది, వివాహం అయ్యాక విజయవాడలో స్థిరపడింది. ఇప్పుడు అమ్మ నా దగ్గరే ఉంటోంది. 
( చదవండి: కన్నడ బ్యూటీ కాజోల్‌ చుఘ్‌ గురించి ఈ విషయాలు తెలుసా? )

సరదాగా ఉండేవారు...
నేను నాలుగో తరగతి చదువుతున్న రోజుల్లో నాన్న నన్ను ఒకే ఒక్కసారి కొట్టారు. ఒక డాక్యుమెంటరీలో నన్ను కొట్టినట్లు నటిస్తే, నేను ఏడ్చినట్లు నటించే సీన్‌లో నవ్వాను. దాంతో నన్ను నాన్న గట్టిగా కొట్టారు. అప్పుడు ఏడిచాను. అంతే. మళ్లీ ఎన్నడూ చెయ్యి చేసుకోలేదు. మాతో క్యారమ్‌ బోర్డు, పేకాట వంటివి సరదాగా ఆడేవారు. నా డిగ్రీ పూర్తయ్యాక నేను ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన కొంత కాలానికి నన్ను చూడటానికి అమెరికా వచ్చినప్పుడు నా కారులో యూనివర్సల్‌ స్టూడియోకు తీసుకెళ్ళాను. ఎంతో సంబరపడ్డారు. మా తాతగారిని తన కారులో తిప్పాలనుకున్న కోరిక నెరవేరనందుకు బాధపడేవారు. నాన్న కోరిక మేరకు భారతదేశానికి తిరిగి వచ్చి, వ్యాపారం ప్రారంభించాను. 

లాంగ్‌ లీవ్‌...
నాన్న మా వూళ్లో షూటింగ్‌ చూడటానికి వెళ్లినప్పుడు ‘వారాలబ్బాయి’ చిత్రంలో, ఆ తరవాత కంచు కవచం, ఎర్ర మట్టి వంటి చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. మధ్యమధ్యలో సినిమాల కోసం లాంగ్‌ లీవ్‌ పెట్టేవారు. నాన్న నటించిన నాటకం చూసిన దాసరిగారు, నాన్నను రామానాయుడు గారికి పరిచయం చేయటంతో, బ్రహ్మపుత్రుడులో పోలీసు వేషం వచ్చింది. ఆ వేషంతో సినిమా అవకాశాలు పెరిగాయి. నాన్న మకాం చెన్నైకి మార్చారు. అయితే.. అది మూణ్నాళ్ల ముచ్చట కావటంతో, తిరిగి గుంటూరు వచ్చేసి, ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం, ట్యూషన్లు చెప్పుకుంటూ ఉండిపోయారు.

( చదవండి: చిరుకు మెగాస్టార్‌ బిరుదు ఎవరిచ్చారో తెలుసా? )

దాసరిగారు నిర్మించిన ‘ఒసేయ్‌ రాములమ్మా!’తో మళ్లీ సినిమాలలోకి ప్రవేశించారు. ఇక వెనక్కి చూసుకోలేదు. చిన్నతనం నుంచి రాయలసీమ మాండలికం బాగా అలవాటు కావటం సినిమాలలో స్థిరపడటానికి ఉపయోగపడింది. అయినప్పటికీ మళ్లీ అక్కడి పల్లెటూళ్లకు వెళ్లి, సరిగ్గా మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. సినిమాలలోకి ప్రవేశించడానికి నాన్న పడిన కష్టాలు, అప్పులు నాకు తెలుసు. ‘కాలక్షేపానికి సినిమాలలో నటించినా పరవాలేదు. అన్నం పెట్టే ఉద్యోగాన్ని వదులుకోవద్దు’ అని సలహా ఇచ్చేవారు.   

సొంతంగానే..
నేను అమెరికాలో ఉన్న రోజుల్లో నాన్న సినిమాలలో బిజీగా ఉన్నారు. నేను మూడు నెలలు సెలవు పెట్టి, గుంటూరు వస్తే, నాన్నను కలవడానికి కుదరలేదు. అందుకని హైదరాబాద్‌  హోటల్‌లో దిగి, నాన్న షూటింగ్‌కి వెళ్లిన సమయంలో నా పనులు పూర్తి చేసుకుని, సాయంత్రం హోటల్‌కి చేరుకుని, నాన్నతో గడిపాను. వస్త్రధారణ విషయంలో ప్రత్యేకంగా ఏమీ ఉండేది కాదు. రెండుమూడు రకాలవి నాలుగైదు జతలు కూడా ఉండేవి కావు. గుంటూరు విజయవాడల మధ్య సొంతంగా డ్రైవ్‌ చేసేవారు. 70 సంవత్సరాలు వచ్చాక డ్రైవర్‌ని పెట్టుకుని కారులోనే ప్రయాణించారు. అంతకుముందు రైలులోనే ప్రయాణించారు.

రాయలసీమ పర్యటన..
సమరసింహారెడ్డి వంద రోజుల వేడుక సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో తిరగాలని యూనిట్‌ సభ్యులు అనుకుంటే, నాన్నగారు మాత్రం ఈ సినిమా రాయలసీమకు సంబంధించినది కనుక ఆ ప్రాంతాలలో పర్యటిద్దాం అన్నారు. ఒక వీడియో కెమెరా తీసుకుని, నాన్న వెంట నేను కూడా రైలులో బయలుదేరాను. నంద్యాల, కర్నూలు, ఆళ్లగడ్డ ప్రాంతాలలో థియేటర్లలో మూడు రోజుల పాటు తిరిగాం. ఆ ప్రాంతీయ భాష కావటం వల్ల, అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నాన్నకు రాయలసీమలో ప్రాంతాలు చూపించాలనే అక్కడకు తీసుకువెళ్తే, అక్కడి వారు నాన్న మీద అభిమానంతో స్వయంగా దగ్గరుండి చూపించారు. అక్కడి స్నేహితులు నాపెళ్లికి కూడా వచ్చారు.

నో అంటే నో 
నాన్న చాలా మితంగా భోజనం చేస్తారు. ఉదయం అల్పాహారంలో రెండు దోసెలు, మధ్యాహ్నం కొద్దిగా అన్నం, రాత్రి రెండు చపాతీలు. నాన్‌వెజ్‌ కూడా చాలా తక్కువ తినేవారు. మమ్మల్ని మాత్రం బాగా తిన మనేవారు. ఆయనకు తినిపించటం మీద చాలా శ్రద్ధ. చాలా సింపుల్‌గా ఉండేవారు. సెలబ్రిటీ అనే భావనే ఉండేది కాదు. కూరలు తేవటానికి కూడా ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడకు వెళ్లినప్పుడు తన అనుమతి లేకుండా సెల్ఫీలు తీస్తే కోపంగా, టీచర్‌లా క్లాసు తీసుకునేవారు. ఎవరైనా అనవసరంగా ఇంగ్లీషులో మాట్లాడితే, ‘తెలుగులో మాట్లాడొచ్చుగా, మా అబ్బాయి తొమ్మిది సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చినా, తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు కదా, మీకేమైంది’ అనేవారు. విలన్‌ వేషాలు వేసే రోజుల్లో ఆడవాళ్లు నాన్న దగ్గరకు రావడానికి భయపడేవారని నాన్న చెప్పారు. నాన్న మరణం మాకు తీరని లోటుగానే ఉంది నేటికీ. 
సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు