డ్రగ్స్‌ కేసు: ఆ గ్రూపులో పలువురు బీ-టౌన్‌ స్టార్లు!

21 Sep, 2020 17:56 IST|Sakshi
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌(ఫైల్‌ ఫొటో)

ముంబై: నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారంలో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇ‍ప్పటికే సుశాంత్‌ ప్రేయసి, నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ సహా ఇద్దరు డ్రగ్‌ డీలర్లను ఎన్‌సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా వాట్సాప్‌ చాట్స్‌, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సుశాంత్‌ మాజీ మేనేజర్‌ జయ సాహా సోమవారం ఎన్‌సీబీ ఎదుట హాజరైనట్లు సమాచారం. ఆమె ఫోన్‌ నుంచి సేకరించిన డేటా ఆధారంగా.. పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సీబీడీ ఆయిల్(గంజాయి ఆకుల నుంచి తీసిన ద్రవం)‌, డ్రగ్స్‌ను సరఫరా చేయాల్సిందిగా తనను కోరినట్లు వెల్లడైంది. వీళ్లందరి కోసం జయ సాహా ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేసినట్లు సమాచారం. (చదవండి: సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌కు సమన్లు..?)

ఇక రియాతో పాటు జయ కూడా మాదక ద్రవ్యాల సరఫరాలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తేలడంతో అధికారులు ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. జయకు సీబీడీ ఆయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అదే విధంగా ఆమె ఫోన్‌లో లభించిన ఎస్‌ఎల్‌బీ, అమిత్‌ తదితర పేర్లతో ఉన్న కాంటాక్టు నంబర్ల గురించి కూడా వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్లు సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్టా తదితరులకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసినట్లుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నో స్మోకింగ్‌, మూడో కన్ను.. సుశాంత్‌ నోట్‌!

మరిన్ని వార్తలు