కొమురం భీమ్‌.. నాకో సవాల్‌!

21 May, 2021 00:46 IST|Sakshi

చేతిలో బల్లెం పట్టుకుని మహోగ్రరూపం దాల్చిన కొమురం భీమ్‌గా ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రంలోని జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త పోస్టర్‌ విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. గురువారం (మే 20) ఎన్టీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని ఎన్టీఆర్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

‘‘మంచి మనసు ఉన్న తిరుగుబాటుదారుడు కొమురం భీమ్‌ పాత్రలో నటిస్తున్నందుకు, అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నా కొత్త పోస్టర్‌ను మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాత్ర పోషించడం నాకో సవాల్‌లా అనిపిస్తోంది’’ అని సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు ఎన్టీఆర్‌. ‘‘మా భీమ్‌ది బంగారంలాంటి మనసు. కానీ తిరగబడితే దేనికైనా బలంగా, ధైర్యంగా నిలబడతాడు’’ అని ట్వీట్‌ చేశారు రాజమౌళి. ఇదిలా ఉంటే.. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తున్న వేళ పుట్టినరోజు వేడుకలకు ఇది సమయం కాదని, దేశం కరోనాను జయించిన రోజున అందరం వేడుక చేసుకుందామని, తన బర్త్‌ డే వేడుకలను నిర్వహించవద్దని ఎన్టీఆర్‌ తన అభిమానులకు విన్నవించుకున్న సంగతి తెలిసిందే.

ప్రశాంత్‌ నీల్‌తో...
ఎన్టీఆర్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకతంలో రూపొందనున్న సినిమా అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. ‘‘ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా చేస్తారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.

మరిన్ని వార్తలు