John Abraham About OTT: ఓటీటీలో చేయను, ఎప్పటికీ నేను బిగ్‌ స్క్రీన్‌ హీరోనే!

22 Jun, 2022 17:14 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం నటించిన యాక్షన్‌ మూవీ 'అటాక్‌: పార్ట్‌ 1' బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా చతికిలపడిన విషయం తెలిసిందే! నిజానికి ఇది మేలో ఓటీటీలో రిలీజ్‌ అవ్వాల్సింది. కానీ దాన్ని వాయిదా వేసి నేరుగా థియేటర్లలో రిలీజ్‌ చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా జాన్‌ అబ్రహం 'ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌' మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూలై 29న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఒక నిర్మాతగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఇష్టపడతాను. ఓటీటీ ఆడియన్స్‌ కోసం సినిమాలు తీస్తాను. కానీ నటుడిగా మాత్రం నేను వెండితెరపై కనిపించడానికి మాత్రమే ఇష్టపడతాను. జనాలు నెలకు రూ.300 లేదా రూ.400 కట్టి నన్ను ఓటీటీలో చూడటం నాకస్సలు నచ్చదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని నా సినిమా చూస్తున్నప్పుడు ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు, మధ్యలో వాష్‌రూమ్‌ అంటూ బ్రేక్‌ తీసుకుంటారు. కేవలం మూడు, నాలుగు వందల రూపాయలకు నేను వారికి అందుబాటులో ఉండను. నేను బిగ్‌ స్క్రీన్‌ హీరోను. అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చాడు జాన్‌ అబ్రహం.

2014లో వచ్చిన ఏక్‌ విలన్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్‌ కపూర్‌, తారా సుతారియా, దిశా పటానీ నటించారు. టీ సిరీస్‌, బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఏక్తా కపూర్‌ నిర్మించింది. కాగా జాన్‌ అబ్రహానికి జాన్‌ అబ్రహం ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్‌పై అతడు విక్కీ డోనర్‌, మద్రాస్‌ కేఫ్‌ సినిమాలు నిర్మించాడు. ఇకపోతే అతడు నటించిన 'అటాక్‌: పార్ట్‌ 1' ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

చదవండి: ఓటీటీలో హిట్‌ కొట్టిన అనకాపల్లి డైరెక్టర్‌, ఇంతకీ ఆయనెవరో తెలుసా?
ఎలా కన్నావని అడుగుతున్నారు? వారికి నా ఆన్సరేంటంటే..

మరిన్ని వార్తలు