సంచలన తీర్పు: బోరున ఏడ్చేసిన హీరోయిన్‌.. భావోద్వేగానికి గురైన జానీ

2 Jun, 2022 07:48 IST|Sakshi

ఆసక్తికరమైన వ్యవహారంలో తీర్పు వెలువడింది. హాలీవుడ్‌ మాజీ జంట జానీ డెప్‌-అంబర్‌ హర్డ్‌ పరువు నష్టం దావా వ్యవహారంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జానీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పాటు అంబర్‌ హర్డ్‌కు జరిమానా విధించింది కోర్టు. పైగా ఆమె ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేసింది కోర్టు.

వర్జీనీయాలోని ఫెయిర్‌ఫ్యాక్స్‌ కౌంటీ కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. నటుడు జానీ డెప్‌(58), అతని మాజీ భార్య అంబర్‌ హర్డ్‌(36) ఇద్దరూ పరువు నష్టం పొందేందుకు అర్హులేనంటూ పేర్కొంటూనే.. డెప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ ఇచ్చిన తీర్పుతో కోర్టు హాల్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. 

అస్పష్టమైన వాదనలు, పోటాపోటీ ఆరోపణల(సంచలన)తో ఆరు వారాలపాటు సాగింది విచారణ. బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించిన జ్యూరీ.. నటి అంబర్‌ హర్డ్‌ తన మాజీ భర్తకు 15 మిలియన్‌ డాలర్ల(తర్వాత దానిని 13.5 మిలియన్‌ డాలర్లకు కుదించింది) పరిహారం చెల్లించాలని తెలిపింది. 2018లో ఆమె రాసిన సెక్సువల్‌ వయొలెన్స్‌ ఆర్టికల్‌ ఒకటి.. జానీ పరువుకు భంగం కలిగించేంది ఉందని, దాని ఆధారంగానే ఆమె ఆయనపై వేధింపులకు, పరువుకు భంగం కలిగించిందని అంచనాకి వచ్చామని కోర్టు పేర్కొంది. 

కోర్టు తీర్పు అనంతరం అంబర్‌ బోరున ఏడ్చేసింది. తన గుండె బద్ధలైందని, నిరాశ చెందానని, ఈ తీర్పు తనకే కాదని.. మహిళలందరికీ దెబ్బ అని ఆమె వ్యాఖ్యానించింది. కేవలం తన పరపతితోనే తన మాజీ భర్త నెగ్గాడంటూ ఆరోపణలు చేసింది ఆమె. 

ఇదిలా ఉంటే జానీ డెప్‌ పేరును ప్రస్తావించకుండానే..  వైవాహిక జీవితపు హింస గురించి.. 2018లో ఆమె ది వాషింగ్టన్‌ పోస్టులో ఒక కథనం రాసింది. దాని ఆధారంగా 50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ 2019 ఫిబ్రవరిలో కోర్టుకు ఎక్కాడు పైరెట్స్‌ ఆఫ్‌ కరేబియన్ నటుడు‌. అంతేకాదు ఆమె తనకు నరకం చూపించేదని, అవమానించేదని, ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో(ఎలన్‌ మస్క్‌)తో ఎఫైర్‌ నడిపించిందని, అదే ఆమెను ప్రభావితం చేసిందని దావాలో ఆరోపించాడు.

ప్రతిగా 2020 ఆగష్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానని, పైగా జానీ డెప్‌.. ఆయన లాయర్‌ నుంచి అసత్య ప్రచారాలు ఎదుర్కొంటున్నాంటూ 100 మిలియన్‌ డాలర్లకు కౌంటర్‌ దావా వేసింది ఆమె. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు వింటూ వచ్చిన కోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. బుధవారం(జూన్‌ 1) తీర్పు జానీ డెప్‌కు అనుకూలంగానే వచ్చినా.. అంబర్‌ హర్డ్‌ ప్రత్యారోపణలను సైతం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిగా 2 మిలియన్‌ డాలర్లను చెల్లించాలంటూ జానీ డెప్‌కు ఆదేశించింది వర్జీనీయా ఫెయిర్‌ఫాక్స్‌ కోర్టు.

నా జీవితం నాకు దక్కింది

కోర్టు తీర్పు పట్ల ‘జాక్‌ స్పారో’ జానీ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అనుకూలంగా రావడంతో.. జానీ డెప్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చారంటూ జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడాయన. ఇదిలా ఉంటే.. 2015లో జానీ డెప్‌, అంబర్‌హర్డ్‌ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే వాళ్ల కాపురంలో మనస్పర్థలు మొదలు అయ్యాయి. 2017లో అధికారికంగా విడాకులు తీసుకుంది ఈ జంట. అయితే కొద్దిరోజులకే ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. అదీ జుగుప్సాకరంగా చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇది వాళ్ల వాళ్ల కెరీర్‌ను సైతం దెబ్బ తీయడం గమనార్హం.

మరిన్ని వార్తలు