5జీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన నటి

31 May, 2021 19:02 IST|Sakshi

5జీ టెక్నాలజీ వల్ల రేడియేషన్‌ సమస్యలు పెరుగుతాయి: జూహీ చావ్లా

ముంబై: దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా కోర్టును ఆశ్రయించారు. సాంకేతికతకు తాను వ్యతిరేకం కాదని.. అయితే దాని వల్ల తలెత్తే పర్యావరణానికి హానీ కలిగించే సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ పిటీషన్‌పై తొలి విచారణ సోమవారం జరిగింది.

ఈ సందర్భంగా జూహీ చావ్లా మాట్లాడుతూ.. ‘‘సాంకేతికపరమైన ఆవిష్కరణల అమలును మేం వ్యతిరేకించడంలేదు. వైర్ లెస్ కమ్యూనికేషన్ సహా సాంకేతిక ప్రపంచం నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలను అందరం ఆస్వాదిస్తున్నాం. అయితే, తదుపరితరం పరికరాల వినియోగంలోనే సందిగ్ధత ఏర్పడుతోంది. వైర్ లెస్ గాడ్జెట్ల నుంచి, సెల్ టవర్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ధార్మికత విడుదలవుతుందని మన సొంత అధ్యయనాలే చెబుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపై రేడియేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని నమ్మడానికి ఇదే ప్రధాన కారణం’’ అన్నారు జూహీ చావ్లా.

5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న దాని కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. ఈ 5జీప్లాన్స్‌ మానవులపై తీవ్రమైన, కోలుకోలేని ప్రభావం చూపడమే కాక భూమీ మీద ఉన్న అన్ని పర్యావరణ వ్యవస్థలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయి అని జూహీ చావ్లా ఆరోపించారు. 

మనుషులకే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా ఈ కొత్త టెక్నాలజీ హానికరం కాదని సంబంధిత విభాగం ధ్రువీకరించాలని జూహీ చావ్లా తన పిటిషన్‌లో డిమాండ్ చేశారు. ప్రస్తుత కాలంలోనే కాకుండా, రాబోయే కాలంలో కూడా ఈ టెక్నాలజీ సురక్షితమా కాదా అనే అధ్యయనం చేయాలని కోరారు. ఇందులో ప్రైవేటు వ్యాపార సంస్థల భాగస్వామ్యం ఉండరాదని జూహీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు