Raghavendra Rao Love Letter To Cinema: దర్శకేంద్రుడి లవ్‌ లెటర్‌.. ఎంతని చెప్పాలంటూ

22 May, 2022 17:40 IST|Sakshi

K Raghavendra Rao Book A Love Letter What I Wrote To Cinema: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆయన డైరెక్ట్‌ చేసిన సినిమాలతో అనేక మంది హీరోలకు మంచి సక్సెస్ ఇచ్చారు. ఇక హీరోయిన్స్‌ను గ్లామర్‌గా చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనేలా పేరు తెచ్చుకున్నారు. అయితే మే 23 ఈ దర్శకేంద్రుడి జన్మదినం. ఈరోజుతో 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా తన జన్మదినానికి ఉన్న ప్రత్యేకతను ఒక లేఖ ద్వారా వివరించారు. 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' అనే పుస్తకాన్ని రాసినట్లు పేర్కొన్నారు రాఘవేంద్ర. ఈ పుస్తకం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. 

''ఈ జన్మదినం ప్రత్యేకత ఏంటంటే, దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం. ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదటిరోజున ‘పాండవ వనవాసం’ చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌పై తొలిసారి క్లాప్‌ కొట్టడంతో నా కెరీర్‌ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు నాకు తొలిసారి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. పదేళ్ల పాటు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కె.ఎస్‌ ప్రకాశ్‌రావు గారు అందించిన ‘బాబు’ (1975) చిత్రంతో దర్శకునిగా సినిమా ప్రయాణం. ఆ రోజు నుంచి మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, ఆనందాలు, ఎత్తులు, లోతులు అవార్డులు, రివార్డులు ఎన్నిచూసుంటాను.  

చదవండి: ఆ హీరోయిన్స్‌ను జిరాఫీలు అన్న అదితి రావ్‌.. ఎందుకంటే ?

48 ఏళ్ల దర్శకత్వ సుదీర్ఘ ప్రయాణం గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో ‘‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’’అంటూ నా స్వహస్తాలతో నేను ఓ పుస్తకం రాసుకున్నాను. ఆ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లతో పాటు, రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను. అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ (నా) ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతన్నాను. 

చదవండి: సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్‌ బాబు

నా ఈ స్థితికి కారణమైన 24 శాఖలవారికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి ‘‘అబద్దాలు రాయటం అనర్ధం, నిజాలు రాయటానికి భయం.. అంటూ మనసు పెన్‌తో రాశాను, ఓపెన్‌గా రాశాను. ఏది కప్పి చెప్పలేదు. విప్పి చెప్పలేదు. కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం.....’’ అంటూ తన బుక్‌ గురించి చెప్పుకొచ్చారు దర్శక దిగ్గజం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. చివరగా నేను చెప్పేదొక్కటే ‘సినిమా అనేది ఇలానే ఉండాలి అనే గీత గీయకూడదు, ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఈ పుస్తకం ప్రతి పుస్తకాలయాల్లో దొరుకుతుంది. పాఠలకులందరూ పుస్తకాన్ని చదివి ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. '' 
                                                                                                                   కె.రాఘవేంద్రరావు

మరిన్ని వార్తలు