‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్‌ చేసిన రాఘవేంద్రరావు

24 Oct, 2021 15:27 IST|Sakshi

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నటుడు సునీల్, బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్‌, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఝాన్సీ కూనం (యూఎస్‌ఏ) సమర్పణలో రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు  ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సంధ్య స్టూడియోస్ నిర్మిస్తున్నఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా యండమూరి సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే. ఆయన నా దర్శకత్వంలో రూపొంది మంచి విజయాలందుకున్న ‘ఆఖరి పోరాటం’, ‘జగదేకవీరుడు-అతిలోక సుందర’ చిత్రాలకు రచయితగా పని చేశారు. యండమూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలని’ అన్నారు.

యండమూరి మాట్లాడుతూ... ‘రాఘవేంద్రరావు నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు గురువులాంటివారు కూడా. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన. ఆయన మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి, మా చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.

చదవండి: హీరోగా రాబోతున్న దర్శకేంద్రుడు.. నలుగురు హీరోయిన్లతో సందడి!

మరిన్ని వార్తలు