తమిళ సినిమాల షూటింగ్‌లు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు?: నిర్మాత

21 Aug, 2022 14:33 IST|Sakshi
నిర్మాత కె.రాజన్‌

తిరుపూర్‌ కుమరన్‌ దర్శకత్వంలో రాజీవ్‌ గాంధీ నిర్మించిన చిత్రం గుండాన్‌ మలై. అందరూ కొత్తవాళ్లు నటించిన ఈ చిత్రానికి నాగజీవన్, అజీమ్, రాజా సంగీతం, అన్నై సెల్వ ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో చిత్ర నిర్మాత, నటుడు కే.రాజన్, గీత రచయిత సొర్కో కరుణానిధి, దర్శకుడు భారతి గణేష్, న్యాయవాది యాదవ్, సినీ సంగీత కళాకార సంఘం అధ్యక్షుడు దినా, శంకర గణేష్‌ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజీవ్‌ గాంధీ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కరోనా కాలంలో ప్రారంభించినట్లు తెలిపారు. మొదట్లో లో బడ్జెట్‌ చిత్రంగా ప్రారంభమైన ఇది ఆ తర్వాత పెద్ద చిత్రం అయిందన్నారు. చిన్న మొత్తంలో ప్రారంభించిన ఈ చిత్రం బడ్జెట్‌ పలు లక్షలు దాటిందని, అయినా అందరి శ్రమతో చిత్రం బాగా వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కే.రాజన్‌ మాట్లాడుతూ చిన్న చిత్రాలే కార్మికులను బతికిస్తున్నాయన్నారు. తమిళ చిత్రాల షూటింగ్‌లను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మన చిత్రాల షూటింగ్‌లను 75 శాతం ఇక్కడ 25 శాతం ఇతర రాష్ట్రాల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారన్నారు.

మలయాళం, తెలుగు చిత్ర పరిశ్రమలు కార్మికులను బాగా చూసుకుంటున్నాయన్నారు. తమిళ చిత్ర పరిశ్రమ మాత్రం కార్మికులను వదిలేసి ఇతరులను బతికిస్తోందని అన్నారు. ఈ చిత్రానికి రెండు పాటలు, మాటలు రాసి, కీలక పాత్రలో నటించిన ఆహాను ప్రసంశించారు. ఆయన శారీరకంగా వికలాంగుడైనా, మానసికంగా బలవంతుడని పేర్కొన్నారు. ఈ గుండాన్‌ మలై చిత్రం కచ్చితంగా విజయవంతం అవుతుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. చిత్రంలో ఓడు ఓడు పాట చాలా బాగుందన్నారు.

చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక
తొలి రెమ్యునరేషన్‌ ఎంతో చెప్పిన ఆలియా, ఆ చెక్‌తో ఏం చేసిందంటే

మరిన్ని వార్తలు