Kaikala Satyanarayana: ఆ విషయం అన్నయ్యకు కూడా తెలుసు..కానీ ఏం చేయలేం:  కైకాల తమ్ముడు

24 Dec, 2022 10:07 IST|Sakshi

మేం మొత్తం ఐదుగురం. అన్నయ్య సత్యనారాయణ తర్వాత ముగ్గురు అమ్మాయిలు, తర్వాత నేను. 1958లోనే అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వెళ్లారు. ఒక ఏడాదిన్నర కష్టాలు పడ్డారు. అన్నయ్య మద్రాస్‌ (ఇప్పుడు చెన్నై) వెళ్లిన నాలుగేళ్లకు మా నాన్నగారు చనిపోయారు. దాంతో ఇంటి బాధ్యత అన్నయ్య తీసుకున్నారు. అప్పటికి మా ఇద్దరి అక్కల పెళ్లి అయింది. మా మూడో అక్క పెళ్లి అన్నయ్యే చేశారు. నన్ను మద్రాస్‌ తీసుకెళ్లి, చదివించారు. ఆ తర్వాత నిర్మాతని కూడా చేసి, మంచి భవిష్యత్తుని ఇచ్చారు. ఒక ఇంటి యజమానిగా అందరి బాగోగులను చూసుకున్నారు.

మాకు మంచి అన్నయ్య దొరికారు. తోడబుట్టినవాళ్లకు, జీవిత భాగస్వామికి, కన్న పిల్లలకు సౌకర్యవంతమైన జీవితం ఇచ్చారు. నేను హైదరాబాద్‌లోనే ఉంటాను. ప్రతి ఆదివారం అన్నయ్య ఇంటికి వెళ్లడం అలవాటు. మమ్మల్ని చూసి, ఆనందపడేవారు. ఆరోగ్యం పాడయ్యాక తాను సఫర్‌ అవుతున్నానని అన్నయ్యకు తెలుసు. అన్నయ్య అనారోగ్యంతో బాధపడుతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితి మాది.

ఎందుకంటే ఆపరేషన్‌ చేయించుకునే వయసు కాదు ఆయనది. అన్నయ్య మాకు దూరం కావడం అనేది భరించలేని విషయం. అయితే ఆయన బాధకు ముక్తి లభించింది. ఓ ఇంటి యజమానిగా చిన్నవాళ్ల బాగోగులు చూసుకుని, చక్కగా సెటిల్‌ చేసి, పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి, వెళ్లిపోయారాయన. అన్నయ్య లేని లోటు మాకు ఎప్పటికీ ఉంటుంది. – కైకాల సత్యనారాయణ తమ్ముడు, నిర్మాత నాగేశ్వరరావు

మరిన్ని వార్తలు