పరిశ్రమ ఇకనైనా కళ్లు తెరవాలి!

8 Feb, 2021 04:39 IST|Sakshi

‘తెలుగు సినిమాతల్లి బర్త్‌డే’ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హెచ్‌.ఎం.రెడ్డి తీసిన మన తొలి పూర్తితెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ బొంబాయి కృష్ణా థియేటర్‌లో 1932 ఫిబ్రవరి 6న విడుదలైందని ప్రముఖ జర్నలిస్ట్‌ – పరిశోధకుడు రెంటాల జయదేవ నిరూపించారు. అప్పటి నుంచి ‘కళా మంజూష’ ఏటా ఫిబ్రవరి 6న ‘తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు’ జరుపుతోంది. ఈసారి ‘తెలుగు సినిమా వేదిక’, ‘నేస్తం ఫౌండేషన్‌’ తోడయ్యాయి.
‘‘స్వచ్ఛంద సంస్థలు కాకుండా, సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే పెద్దలు, ఛాంబర్, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్, డైరెక్టర్స్‌ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ లాంటివి ఇకనైనా కళ్ళు తెరిచి, ఇక ప్రతి ఏడాదీ తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు జరపాలి’’ అని సభలో పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.

‘‘అరుదైన పాత సినిమాల ప్రింట్లను డిజిటలైజ్‌ చేయించి, సినీచరిత్ర నూ, సమాచారాన్నీ భద్రపరిచే పనిని రాష్ట్ర ఆర్కైవ్స్, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికైనా చేయించాలి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్‌ ల్యాబ్స్‌ రమేశ్‌ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు ఎన్‌. శంకర్, నిర్మాతలు ఆదిశేషగిరిరావు, ఏ.ఎం.రత్నం, విజయ్‌కుమార్‌ వర్మ, నటి కవిత, కెమెరామ్యాన్‌ ఎం.వి. రఘు అతిథులుగా హాజరయ్యారు. దర్శకులు బాబ్జీ, రామ్‌ రావిపల్లి, నిర్మాతలు గురురాజ్, విజయ వర్మ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మోహన్‌ గౌడ్, ఫిల్మ్‌ స్కూల్‌ ఉదయ్‌ కిరణ్, జర్నలిస్ట్‌ రెంటాల జయదేవ మాట్లాడారు. దివంగత నిర్మాత వి.దొరస్వామిరాజు పేరిట సీనియర్‌ నిర్మాతలు ఎన్‌.ఆర్‌. అనురాధాదేవి, జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, గొట్టిముక్కల సత్యనారాయణరాజు, దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలకు పురస్కారాలు అందించారు.
జయదేవ, పరుచూరి, వెంకట్, కవిత, తుమ్మలపల్లి, తమ్మారెడ్డి, ఎన్‌. శంకర్, గురురాజ్, బాబ్జీ, రామ్‌ రావిపల్లి
 

మరిన్ని వార్తలు