Baahubali Prabhakar: అఖండ తర్వాత వరసగా 14 సినిమాల్లో పోలీస్‌ పాత్రలే..

20 Jul, 2022 19:37 IST|Sakshi

ఐదు భాషల్లో 120కు పైగా సినిమాల్లో నటించా.. 

చిరంజీవితో నటించే అవకాశం కోసం వేచి చూస్తున్నా..  

‘సాక్షి’తో బాహుబలి ప్రభాకర్‌  

మర్యాదరామన్నలో ‘ఏమప్పా మా ఊరు వచ్చి మా ఇంట్లో తినకుండా ఊర్లో ఎంగిలి పడతావా.. మా వంశం గౌరవం ఏమైపోను.. రా అప్పా జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తాము..’ బాహుబలిలో కిలికిలి భాషలో ‘నిమ్డా డోజ్రాస్టెల్మీ’అనే డైలాగ్స్‌తో తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు కాలకేయ ప్రభాకర్‌. అలియాస్‌ బాహుబలి ప్రభాకర్‌. అక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఐదు భాషల్లో 120కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తన సినీ జీవన ప్రయాణం సంతోషకరంగా సాగుతోందంటున్న ప్రభాకర్‌తో 
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

సాక్షి: మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది.? 
ప్రభాకర్‌: రైల్వే పోలీస్‌ సెలక్షన్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాను. అనివార్య కారణాల వల్ల సెలక్షన్‌ నిలిపివేశారు. తీరిక సమయంలో ఏం చేయాలో అర్థం కాక పద్మాలయ స్టూడియోలో అతిథి సినిమా షూటింగ్‌ జరుగుతుందని తెలిసి స్నేహితుడితో చూడటానికి వెళ్లాను. అప్పుడు డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి నన్ను చూసి నువ్వు ఆర్టిస్ట్‌వా అని అడిగారు. ఏం చెప్పాలో తెలియక ఆర్టిస్ట్‌ అని చెప్పేశాను. దీంతో ఆ సినిమాలో హీరోని రౌడీలు వెంబడించే సన్నివేశం ఒకటి ఇచ్చారు. అలా నా సినీ ప్రస్థానం మొదలైంది. పోలీస్‌ అవుదామని వచ్చిన నేను నటుడిగా మారిపోయాను. విలన్‌గా గుర్తింపు పొందాను. 


సాక్షి: దర్శకుడు బోయపాటి గురించి చెప్పండి?  

ప్రభాకర్‌: బోయపాటి శ్రీను కమిట్‌మెంట్‌ ఉన్న దర్శకుడు. నటుడిలో ఉన్న ప్రతిభను గుర్తించి తన స్టైల్‌లో సన్నివేశాన్ని పండించగల సమర్థుడు. నటులకు ఇబ్బంది లేకుండా చూసుకునే మనస్తత్వం ఆయనిది. 
 
సాక్షి: మీరు ఈ మధ్య ఎక్కువగా పోలీస్‌ పాత్రల్లోనే కనిపిస్తున్నారు?  
ప్రభాకర్‌: అఖండలో నేను చేసిన పోలీస్‌ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. వాస్తవానికి పోలీస్‌ అవ్వాలనే కోరిక రియల్‌ లైఫ్‌లో తీరకపోయినా.. రీల్‌ లైఫ్‌లో కుదిరింది. అఖండ తర్వాత వరసగా 14 సినిమాల్లో పోలీస్‌ పాత్రలే వచ్చాయి.  


సాక్షి: మీకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా?  

ప్రభాకర్‌: నేను పూర్తిస్థాయిలో నటుడిగా మర్యాదరామన్న సినిమాలో నటించాను. నేను మొదటి చెప్పిన ‘ఏమప్పా మా ఊరు వచ్చి...’ డైలాగ్‌తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బాహుబలి, జై సింహా, అఖండ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు నా సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయాయి.  

సాక్షి: ఎవరికైనా మీరు కృతజ్ఞతలు చెప్పాలంటే..  
ప్రభాకర్‌: నేను ఈ స్థాయిలో ఉన్నానంటే.. నలుగురే ప్రధాన కారణం. ఎస్‌ఎస్‌ రాజమౌళి, బోయపాటి శ్రీను, హరీష్‌ శంకర్, వంశీ(దొంగాట). నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. వీరికి జీవితాంతం రుణపడి ఉంటాను.  


సాక్షి: ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు? 

ప్రభాకర్‌: తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా భాషల్లో 120కి పైగా సినిమాల్లో నటించాను. ప్రస్తుతం ఆరు తెలుగు, ఏడు తమిళం, రెండు కన్నడ, ఒడియా, మలయాళంలో ఒక్కొక్క సినిమాలో నటిస్తున్నాను. 

సాక్షి: కాలకేయుడిగా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారా?  
ప్రభాకర్‌: బాహుబలిలో కాలకేయరాజుగా రాజమౌళి నన్ను ఎంచుకోవడం నిజంగా నా అదృష్టం. రమ్యకృష్ణతో పోటీ పడి చేయాల్సిన పాత్ర అది. మొదట్లో కాస్త భయపడ్డాను కానీ.. ఆయన చాలా ప్రోత్సహించారు. కిలికిలి భాషలో నేను చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. అలా నా పాత్ర విజయవంతమైంది. నిమ్డా... అనే డైలాగ్‌ నేర్చుకునేందుకు ఓ రాత్రంతా కష్టపడ్డాను. ఆ కష్టానికి ఫలితం దక్కింది.  


సాక్షి: మీ ఫ్యామిలీ గురించి చెప్పండి?  

ప్రభాకర్‌: నా భార్య రాజ్యలక్ష్మి టీచర్‌గా పనిచేస్తున్నారు. పిల్లలు శ్రీరామ రాజమౌళి, రుత్విక్‌ ప్రీతమ్‌. పెద్ద అబ్బాయికి రాజమౌళి ఉండేలా పేరు పెట్టాం. ఈ ప్రయాణంలో నా భార్య సహకారం ఎంతో ఉంది. నేను షూటింగ్‌కు వెళ్లినప్పుడు తనే అంతా చూసుకుంటుంది.  

సాక్షి: అగ్ర కథానాయకులతో నటించారు.  చిరంజీవితో ఎప్పుడు?  
ప్రభాకర్‌: ఇప్పటివరకు నేను అందరి అగ్ర కథానాయకులతో నటించాను. ఇంకా చిరంజీవితో నటించే అవకాశం రాలేదు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. మర్యాదరామన్న సినిమాలో నాకు అవకాశం ఇచ్చి, బాహుబలి–1తో సినీ ఇండస్ట్రీలో నాకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చారు రాజమౌళి. నేను నటుడిగా ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ప్రధాన కారణం ఆయనే. రాజమౌళి నా దేవుడు. (క్లిక్‌: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్‌)

మరిన్ని వార్తలు