వీడియో: సినిమా అనే ఓ బస్సు పట్టుకుని.. కళాతపస్వి మాటలు వైరల్‌

3 Feb, 2023 10:49 IST|Sakshi

కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ కన్నుమూతతో యావత్‌ సినీ రంగం విషాదంలో కూరుకుపోయింది. 92 ఏళ్ల వయసులో వృద్ధాప్య రిత్యా సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారాయన. తొలినాళ్లలో కుటుంబ కథా చిత్రాలతో అలరించిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో కళలను మేళవించి తీసిన ప్రేక్షకలోకాన్ని రంజింప చేశాయి. సినీ ప్రముఖులే కాదు.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన తరం సైతం సోషల్‌ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తోంది. 

‘‘సినిమా అనే ఓ బస్సు పట్టుకుని.. సినిమా చూసే ప్రేక్షకులను భక్తులు అనుకుని.. నేను ఒక బస్సు నడిపే డ్రైవర్‌ని. నేనేం చేయాలి నేను?’’. ఏం చేయగలరు.. ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించడం తప్ప! అందుకే ఆ దర్శక దిగ్గజానికి నివాళిగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అంతేకాదు.. దర్శకుడిగా సెట్స్‌లో  ప్రత్యేకమైన దుస్తుల్లో కనిపించడమూ చాలామందికి తెలిసే ఉండొచ్చు.  

దర్శకత్వం.. ఓ బాధ్యత, ఓ విధి, ఓ ఉద్యోగం లాంటిది. అందుకే దాన్ని విధిగా ఆచరించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన డైరెక్షన్‌లో ఉన్నప్పుడు సెట్స్‌లో మిగతా సిబ్బందిలాగే.. ఖాకీ యూనిఫాంలో కనిపించేవారట. ‘‘దర్శకుడ్ని అయిపోగానే తెల్ల ప్యాంటూ, తెల్ల చొక్కా, తెల్ల బూట్లూ, మెళ్లో గొలుసులూ వేసుకుని హడావుడి చేయడం(ఆ టైంలో దర్శకులకు సింబాలిజం అది) నాకిష్టం లేదు. దర్శకుడి కుర్చీ దక్కితే కళ్లు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుంది కదా? అందుకే మామూలుగా ఉండాలనుకున్నా!’’ అని పాత ఇంటర్వ్యూలలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు