k Viswanath: సినిమా రంగంలోకి రాని విశ్వనాథ్‌ వారసులు.. ఎందుకంటే

4 Feb, 2023 08:44 IST|Sakshi

పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడిన శాస్త్రీయ సంగీతానికి అరచేతులు అడ్డుపెట్టిన ఆ మహా దర్శకుడు తరలి వెళ్లిపోయారు. మావి చిగురు తినగానే పలికే కోయిలను కోయిల గొంతు వినగానే తొడిగే మావిచిగురును చూపిన కళాహృదయుడు తన శకాన్ని ముగించారు. కళాతపస్వి కె విశ్వనాథ్‌ గురువారం(ఫిబ్రవరి 2న) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసిందంటూ టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయనతో ఉన్న అనుబంధాలను నెమరువేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తన సినిమాల గురించి ఈ కళాతపస్వి వివిధ సందర్భాల్లో ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూల్లోని కొన్ని పదనిసలు ఈ విధంగా... 

సినిమా టైటిల్స్‌లో ‘ఎస్‌’ సెంటిమెంట్‌ ఎందుకు?
విశ్వనాథ్‌: సినిమా వాళ్ళం పిరికివాళ్ళమండీ! కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తాం కదా... భయాలు, సెంటిమెంట్లు ఎక్కువ! ‘ఎస్‌’తో పెట్టిన రెండు సినిమాలు వరుసగా హిట్‌ కావడంతో అలా పెట్టుకుంటూ వచ్చాను.

మరి ‘ఆపద్బాంధవుడు’ దగ్గర ఆ రిస్క్‌ ఎందుకు తీసుకున్నారు?
బాగా గుర్తు... ఓరోజు ‘ఏ టైటిల్‌ అయితే బావుంటుంది ఈ సినిమాకు?’ అనుకుంటుండగా... క్యారెక్టర్‌కి తగ్గట్టుగా అయితే ‘ఆపద్బాంధవుడు’ బాగుంటుందన్నాను. అందరూ ఓకే అన్నారు. మరి ఎందుకని ఆ రోజు ఆ ‘ఎస్‌’ సెంటిమెంట్‌ మైండ్‌ నుంచీ స్లిప్‌ అయిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు.

మీరు పాటలు కూడా రాసేవారట...
సందర్భం వచ్చింది కాబట్టి చెబితే తప్పులేదేమో! నేను స్క్రిప్ట్‌ రాస్తున్నప్పుడే సిట్యుయేషన్‌కి తగ్గ పాట-లిరిక్‌ రాసుకుంటాను. దానికి నేను ‘అబద్ధపు సాహిత్యం’ అని పేరుపెట్టాను. అలా ఫ్లోలో రాసి, తర్వాత సినిమాలో ఉంచేసిన పల్లవులెన్నో – ‘స్వాతిముత్యం’లో ‘వటపత్రసాయికి...’, ‘శ్రుతిలయలు’లో ‘తెలవారదేమో స్వామీ...’, ‘స్వాతికిరణం’లో ‘తెలిమంచు కరిగింది...’ – అలా... చాలానే ఉన్నాయి.

మరి పాటంతా మీరే రాయొచ్చుగా?
కొన్ని రాశాను... ‘స్వరాభిషేకం’లో ‘కుడి కన్ను అదిరెను...’ పాట పూర్తిగా నేనే రాశాను. అయితే పేరు వేసుకోలేదు. 

రాసింది చెప్పుకోవడంలో తప్పేముందండీ
ఏమో, చెప్తే నమ్ముతారో లేదో జనాలు!

మిమ్మల్ని నమ్మకపోవడమా!
అలా అని కాదు... నాకసలు పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఇష్టం ఉండదు. (నవ్వుతూ) ఏదోపెళ్ళిచూపులకెళ్తే ‘ఆయన పెట్టుకున్న ఉంగరం కూడా నాదే!’ అని ఎవరో అన్నట్టు... ‘ఫలానా సినిమాలో ఫలానా పాటకు పల్లవి నేనే రాశాను’ అని ఏం చెప్పుకుంటాను చెప్పండి?

మీ కుటుంబం నుంచి ఎవ్వరూ సినిమా ఫీల్డ్‌కి రాకపోవడానికి కారణం?
నేనే ప్రోత్సహించలేదు. వాళ్లు ఇక్కడ రాణిస్తారనే నమ్మకం నాకు లేదు. ఈ రోజుల్లో పైకి రావడమంటే చాలా కష్టం. మా రోజులు వేరు. ప్రతిభను గుర్తించే మనుషులు అప్పుడు చాలామంది ఉండేవారు. డబ్బుల విషయంలోనూ, పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ ఇక్కడో అనిశ్చితి ఉంది. అందుకే మా పిల్లల్ని బాగా చదివించి వేరే రంగాల్లో స్థిరపడేలా చేశాను.

విశ్వనాథ్‌ వారసులుగానైనా ఓ గుర్తింపు వచ్చేదేమో?
నా గౌరవ మర్యాదలన్నీ నా బిడ్డలకు ట్రాన్స్‌ఫర్‌ కావాలనే రూలేమీ లేదిక్కడ. ఎవరికి వాళ్లే ప్రూవ్‌ చేసుకోవాలి. నాలాగా మా పిల్లల్ని కూడా డైరెక్టర్లు చేయాలనుకుని నేను సొంతంగా డబ్బులు పెట్టి సినిమాలు తీయలేను కదా. అంత డబ్బు కూడా నేను సంపాదించలేదు. మా పిల్లలు ఫలానా కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్నారని నేను గర్వంగానే చెప్పుకోగలను.

మ్యారేజ్‌ డే లాంటివి జరుపుకుంటారా?
భార్యాభర్తల మధ్య తప్పనిసరిగా ఉండాల్సింది పరస్పర నమ్మకం. ప్రేమ, గౌరవం మన హృదయాంతరాళంలో నుంచి రావాలి. అంతేకాని, ప్రత్యేకించి ఫాదర్స్‌ డే, మదర్స్‌ డే, ప్రేమికులదినం, వైవాహిక దినం – అని ఏడాదికి ఒకరోజే మొక్కుబడిగా చేసుకోవడంలో అర్థం లేదు.

ఒక్కోసారి భోజనం కూడా మరచిపోయేవారట కదా?
సినిమా రూపకల్పనలో ఉండగా ఒక్కొక్కప్పుడు గాఢంగా సంగీత, సాహిత్య చర్చల్లో మునిగిపోతే – అసలు టైమే తెలిసేది కాదు. భోజనవేళ దాటిపోతోందని ఎవరైనా గుర్తు చేస్తే కానీ గుర్తొచ్చేది కాదు.

సినిమా ఇండస్ట్రీ అంతా ఓ పోకడలో కొట్టుకుపోతూ, ప్రవాహంలో వెళ్తున్న టైమ్‌లో అడ్డుకట్ట వేసి మళ్లీ మీరు దాన్నివెనక్కి తెచ్చారనే భావన మీ అభిమానుల్లో ఉంది...
నిజమే. ‘పాశ్చాత్య సంగీతపు పెను తుఫానులో రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీతపుజ్యోతిని కాపు కాయడానికి తన చేతులు అడ్డు పెట్టినవారందరికీ పాదాభివందనం చేస్తున్నా’ అని ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి డైలాగ్‌ చెబుతాడు. నేను అలా చేశానని నాకు పాదాభివందనం చేయమని కాదు.

అభిమానుల అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటాను. ఇప్పటికీ ఒప్పుకోకపోతే నేను మూగవాణ్ణి అయిపోతా. నా బుద్ధి మేరకు నేను నిజంగానే చేశాను. క్లాసికల్‌ మ్యూజిక్, డ్యాన్స్‌ పెట్టి సినిమాలు చేస్తే ఎవరు ఆదరిస్తారు? ఇది కమర్షియల్‌ ఆర్ట్‌ కదా? మీ సినిమాలకు డబ్బు వస్తుందా? నిర్మాత ఏమవుతాడు? అన్నదానికి విరుద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దాని ఫలితమే నాకు వచ్చిన అవార్డులు... ఈ రోజు (దాదా ఫాల్కే వచ్చిన సందర్భంగా..) వచ్చిన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా!

మరిన్ని వార్తలు