Kallu Chidambaram: నాన్న నవ్వుతూ వెళ్లిపోయారు

4 Jul, 2021 08:00 IST|Sakshi

సినీ పరివారం

కళ్లు’ చిత్రంలో నటించి ఇంటి పేరు కొల్లూరును కళ్లుగా మార్చేసుకుని, కళ్లు చిదంబరంగా మారిపోయారు. పోర్టు ట్రస్ట్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూనే, నాటకాలు వేయిస్తూ, సినిమాలలో నటించారు. తుది శ్వాస వరకు తన జీవితాన్ని నాటక రంగానికి, సేవా కార్యక్రమాలకు, పర్యావరణ పరిరక్షణ కోసమే వినియోగించారు. తండ్రి గురించి రెండో కుమారుడు కొల్లూరు సాయి రాఘవ రామకృష్ణుడు అనేక విషయాలు పంచుకున్నారు.

‘కళ్లు’ చిత్రంలో నటించిన నాన్న కొల్లూరి చిదంబరరావు ‘కళ్లు చిదంబరం’ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. నాన్నగారు ఆగస్టు 8, 1948లో నాగుబాయమ్మ, వెంకట సుబ్బారావు దంపతులకు విజయనగరంలో జన్మించారు. తాతగారు స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌. నాన్నగారికి ఒక అన్న, నలుగురు అక్కయ్యలు ఉన్నారు. నాన్నగారే అందరికంటె చిన్నవారు. విజయనగరం మునిసిపల్‌ హైస్కూల్‌లో ఎస్‌. ఎస్‌. ఎల్‌. సి, విశాఖపట్నంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. నాన్నగారికి మేం నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అక్క, అన్నయ్య తరవాత నేను, చెల్లి కవల పిల్లలం. తల్లిదండ్రుల ఆశీస్సులతో అందరం హాయిగా ఉన్నాం. మా అందరికీ నాన్నగారి మీద భయంతో కూడిన గౌరవం ఉంది. నాన్నగారిని ప్రతి రోజు ఏదో ఒక దేవాలయానికి తీసుకువెళ్లేవాడిని. నాన్నగారికి నాటకాలు వేయటం కంటె, చూడటంలోనే ఆసక్తి ఎక్కువ. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూనే, కళాకారులను ప్రోత్సహించారు. 

విశ్రాంతి లేకపోవటం వల్లే...
ప్రముఖ సినిమటోగ్రాఫర్‌ ఎం. వి. రఘు గారి దర్శకత్వంలో ‘కళ్లు’ చిత్రంలో  1987 డిసెంబర్‌లో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి, మొదటి చిత్రానికే ఎన్‌టిఆర్‌ చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నారు. ఆ సంవత్సరమే ‘మద్రాస్‌ కళాసాగర్‌ అవార్డ్‌’ కూడా అందుకున్నారు. పోర్ట్‌ ట్రస్ట్‌ ఉద్యోగికి అంత పేరు రావడంతో, డిపార్ట్‌మెంట్‌ నాన్నను ప్రోత్సహించింది. అందరూ అనుకున్నట్లు నాన్నగారికి చిన్నప్పటి నుంచి మెల్ల కన్ను లేదు. చాలా స్మార్ట్‌గా ఉండేవారు. పన్నెండు సంవత్సరాల పాటు నిద్రాహారాలు లేకుండా నాటకాలు నిర్వహిస్తూండటంతో ఒక నరం పక్కకు వెళ్లి, మెల్ల కన్ను ఏర్పడింది. ఆ లోపమే నాన్నగారిని సినీ రంగానికి పరిచయమయ్యేలా చేసింది.

నాటకం చూశారు..
గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్లు’ నాటకాన్ని చూసి, సినిమాగా తీయటం కోసం, సినిమా డైరెక్టర్‌ అండ్‌ టీమ్‌ వస్తారని తెలిసి, ‘నాటకం నాటకంలా ఉండాలే కాని, సినిమాగా తీయకూడదని, నాటకంలో నటించన’ని నాన్న పట్టుబట్టారు. ‘మీ కోసం కాకపోయినా, మా కోసమైనా రండి’ అని అందరూ అడగటంతో, అయిష్టంతోనే ఆ నాటకం వేశారు. డైరెక్టర్‌ రఘుగారు అందరినీ వదిలేసి, నాన్నగారిని ఎంపిక చేయటంతో, నాన్నగారికి ఆశ్చర్యం వేసింది. ‘ఆ ఒక్క సినిమా చేసి ఆపేద్దాం’ అనుకున్నారు. కాని చెవిలోపువ్వు, ఆర్తనాదం, ముద్దుల మావయ్య... ఇలా 300 చిత్రాలలో నటించారు. 

భయపడ్డాం...
కళ్లు సినిమా షూటింగ్‌ వైజాగ్‌లోనే జరగటం వల్ల ఒక్కో రోజు ఆ మేకప్‌తోనే ఇంటికి వచ్చేవారు. ఒక రోజున... రక్తం కారుతున్న మేకప్‌తోనే ఇంటికి వచ్చారు. మాకు భయం వేసింది. అప్పుడు నా వయసు పదేళ్లు. ఆ సీన్‌లో నాన్నగారు, కుక్కని పట్టుకుని, ‘కళ్ళు లేని కబోదిని రామా (నాటకం అంతా కళ్ళు ఉంటాయి. లే నట్లు నటిస్తారు), దయగల వారు ధర్మం చేసుకోండి రామా, లేకపోతే కుక్క బతుకు తప్పదు రామా’ అని కుక్క వైపు చూపిస్తూ అడుక్కుంటారు. ఆ డైలాగు మాకు చాలా ఇష్టం.

మానేద్దాం అనుకున్నారు..
సినిమాలలో బిజీ కావటంతో, చేస్తున్న ఉద్యోగానికి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోవాలనుకున్నారు. మా మేనత్త గారి సలహా మేరకు ఆ ఆలోచన మానుకుని, పాతికేళ్లు వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ ప్రయాణించారు. అప్పుడప్పుడు రిజర్వేషన్‌ లేక, అప్పటికప్పుడు టికెట్‌ తీసుకుని, టీటీ చుట్టూ సీట్‌ కోసం తిరిగేవారు. ‘అనవసరంగా ఎందుకు కష్టపడుతున్నారు నాన్నా మీరు’ అనేవాళ్లం. ‘నా కోసం కాదురా, సమాజం కోసం, పరిశ్రమ కోసం’ అనేవారు. కుటుంబ జీవితం మిస్‌ కాకుండా, ఆఫీస్‌ విడవకుండా సినిమాలలో నటించారు. పారితోషికం ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. మంచి పేరు సంపాదించారు.

నాన్నే ఉండాలన్నారు వర్మ...
‘గోవిందా గోవిందా’ సినిమాలో ‘నేను ఈ నటుడితో నటించను’ అని శ్రీదేవి అన్నారట. అప్పుడు వర్మగారు, ‘ఈయన అసిస్టెంట్‌ ఇంజినీర్, నంది అవార్డు అందుకున్న నటుడు, ఆయన ఉంటేనే ఈ రోజు నేను డైరెక్ట్‌ చేస్తాను’ అనటంతో శ్రీదేవి ఒప్పుకున్నారట. ‘అమ్మోరు’ సినిమా విడుదలయ్యాక అందరూ నాన్నను ‘అమ్మోరు తల్లీ’ అని పిలిచేవారు.

ఐసియూలో ఉండి కూడా..
విశాఖ కళాకారులకి ఏదో ఒకటి చేయాలనే తపనతో చివరి రోజుల్లో సినిమాలు వదిలిపెట్టి, ‘కళలు వేరైనా కళాకారులు ఒక్కటే’ అనే నినాదంతో ‘సకల కళాకారుల సమాఖ్య’ స్థాపించి కళాకారులను ప్రోత్సహించారు. 2013 మే నెలలో ఊపిరితిత్తుల సమస్య రావటంతో ఇంటికే పరిమితమయ్యారు. రెండున్నర సంవత్సరాలు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేషన్‌ మీదే ఉంటూ, వైజాగ్‌లో అన్ని కార్యక్రమాలకు వెళ్లేవారు. ఐసియులో ఉండి కూడా, ‘రాఘవేంద్ర మహత్యం’ నాటకం వేయించినప్పుడు, ‘అనారోగ్యంతో ఉండి కూడా ఇంత చక్కగా వేయించారు’ అని అందరూ ఆశ్చర్యపోయారు. 2015 అక్టోబర్‌ 19న నవ్వు ముఖంతోనే కాలం చేశారు. ‘ఇచ్చిన మాట తప్పకూడదు. డబ్బు పోయినా పరవాలేదు, పరువు పోకూడదు. రేపు అనేది ఉండదు. ఈ రోజే చేసేయాలి’ అని నాన్నగారు చెప్పిన మాటలను ఇప్పటికీ రోజూ గుర్తు చేసుకుంటూ, సాధ్యమైనంత వరకు ఆచరిస్తున్నాం.
- సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు