రాజు అంటే ఇలాగే ఉంటాడు.. ‘బాహుబలి’తో ప్రభాస్‌ ఓ మార్క్‌ క్రియేట్‌ చేశారు

4 Aug, 2022 07:36 IST|Sakshi

– కల్యాణ్‌ రామ్‌

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు’ అనే మాటలను నేను నమ్మను. ఇతర భాషలతో పోలిస్తే మన తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పవాళ్లు.. సినిమాలను ప్రేమిస్తారు. కథ బాగుంటే తెలుగు చిత్రాలనే కాదు.. పరభాషా సినిమాలను కూడా ఆదరిస్తారు’’ అని హీరో కల్యాణ్‌ రామ్‌ అన్నారు. వశిష్ఠ్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌పై హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ పంచుకున్న విశేషాలు.

► వశిష్ఠ్‌ చెప్పిన ‘బింబిసార’ కథ వినగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. పైగా సరికొత్త పాయింట్‌ కావడంతో ఓకే చెప్పేశాను. కథ బాగుండటం, చక్కని టీమ్‌ కుదరడంతో తను అనుకున్నది అనుకున్నట్లు తీశాడు వశిష్ఠ్‌.

► మా తాతగారు (ఎన్‌టీఆర్‌), బాబాయ్‌ (బాలకృష్ణ)లు రాజులుగా చేసి, మెప్పించారు. ఈ చిత్రంలో బింబిసారుడు అనే రాజు పాత్ర అనగానే నేను సెట్‌ అవుతానా? అనిపించింది. రాజు అంటే ఇలాగే ఉంటాడు అనేలా ఈ తరం నటుల్లో ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో ఓ మార్క్‌ క్రియేట్‌ చేశారు. నా లుక్‌ విషయంలో ముందు కొన్ని అనుకున్నా ఫైనల్‌గా మూవీలోని లుక్‌ ఫిక్స్‌ చేశాం. ఈ లుక్‌ కోసం రెండు నెలలు కష్టపడ్డాను.

► ‘ఏ కథలో ఏ హీరో నటించాలో రాసిపెట్టి ఉంటుంది. ఏ కథ అయినా ఆ హీరోని వెతుక్కుంటుంది’ అని మా నాన్న (హరికృష్ణ) చెప్పేవారు. ‘అతనొక్కడే’ చిత్రకథ కూడా ఎందరో విన్నా ఫైనల్‌గా నేను చేశా. అలా ‘బింబిసారుడు’ కథ నా కోసం పుట్టింది. ప్రేక్షకుల అంచనాలను వందశాతం రీచ్‌ అవుతాం.

► కోవిడ్‌కి ముందు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించాం. అప్పుడు ఇతర భాషల్లో చేద్దామనుకోలేదు. ఇప్పటికిప్పుడు ఇతర భాషల్లో విడుదల చేయాలంటే మార్కెటింగ్, ప్రమోషన్స్‌ కోసం సమయం పడుతుంది. అంత టైమ్‌ మాకు లేదు.. అందుకే తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాం.. ఇక్కడ హిట్‌ అయిన తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం.
 


► తెలుగువాళ్లకి ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే సినిమానే. కుటుంబంతో కలిసి థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తారు. ట్రైలర్‌ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా అని ప్రేక్షకులు నిర్ణయించుకుంటున్నారు. మనం మంచి కంటెంట్‌ ఉన్న సినిమా తీస్తే తప్పకుండా చూస్తారు. ఓ సినిమా బాగుందంటే వచ్చే మౌత్‌ పబ్లిసిటీకి చాలా పెద్ద స్పాన్‌ ఉంది. నా ‘అతనొక్కడే’ చిత్రం కూడా తొలి ఆట నుంచే మౌత్‌ పబ్లిసిటీతో సూపర్‌ హిట్‌ అయింది. ఈ మధ్య రిలీజ్‌ అయిన ‘మేజర్, విక్రమ్‌’ సినిమాల్లో మంచి కంటెంట్‌ ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

► ఓ నిర్మాతగా నేను ఎలాంటి ఒత్తిడి తీసుకోను.. నా దృష్టంతా నటనపైనే ఉంటుంది. ప్రస్తుతం ‘బింబిసార’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండటంతో తెలుగులో షూటింగ్‌ల బంద్‌ విషయాన్ని నేను పట్టించుకోవడం లేదు. ఈ సినిమా విడుదల తర్వాత స్పందిస్తాను. రొమాంటిక్‌ సినిమాలు నాకు సెట్‌ అవ్వవు.. అందుకే చేయను (నవ్వుతూ). ‘బింబిసార 2’కి కథ రెడీగా ఉంది. నేను నిర్మాతగా తమ్ముడితో(ఎన్టీఆర్‌) ఓ పాన్‌ ఇండియా సినిమా ఉంటుంది. మంచి కథ కుదిరితే బాబాయ్‌ (బాలకృష్ణ)తోనూ ఓ సినిమా నిర్మిస్తాను. 

మరిన్ని వార్తలు