నటి కోవై సరళ గురించి కమల్‌హాసన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

30 Oct, 2022 08:55 IST|Sakshi

తమిళసినిమా: సీనియర్‌ నటి కోవై సరళ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సెంభీ. సైలెంట్‌ ఆర్ట్స్‌ ఆర్‌. రవీంద్రన్, ఏఆర్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ అజ్మల్‌ ఖాన్, రియా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మైనా చిత్రం ఫేమ్‌ ప్రభు సాల్మన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి ఇందులో నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. నటుడు కమలహాసన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రధాన పాత్ర పోషించిన కోవై సరళ మాట్లాడుతూ దర్శకుడే ఈ చిత్ర కథానాయకుడు అని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో నటించడం చాలా సులభం అన్నారు. ప్రభు సాల్మన్‌ చెప్పినట్టు చేస్తే చాలని చిత్రం బాగా వస్తుందన్నారు. నటుడు కమలహాసన్‌ మాట్లాడుతూ ఇక్కడ నటి కోవై సరళను కొందరు అక్క అని మరికొందరు అమ్మ అని పేర్కొన్నారని.. అయితే తాను ఏమనాలో తెలియడం లేదని అన్నారు. సరళ పాప తనకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. ఆమె ఈ చిత్రంలో చాలా బాగా నటించారని కొనియాడారు. అదేవిధంగా బాలనటి కూడా ఎలాంటి సంకోచం లేకుండా చాలా చక్కగా నటించిందని ప్రశంసించారు.

16 వయదినిలే చిత్రం గురించి ఇప్పటికి చెప్పుకుంటున్నారంటే అదే పెద్ద చిత్రం అని కమల్‌ పేర్కొన్నారు. ఇన్ని కోట్లతో రూపొందించామే ఆ చిత్రం పేరు ఏంటి ?అని అడిగితే అది పెద్ద చిత్రం కాదని అన్నారు. ప్రేక్షకులు మంచి కథా చిత్రాలను ఆదరించాలని, నచ్చకపోతే ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పాలని పేర్కొన్నారు. ప్రతిభావంతులు చాలామంది అవకాశాలు లేక గుర్తింపుకు నోచుకోలేక పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కె.భాగ్యరాజ్, ఆర్‌.వి. ఉదయకుమార్, నిర్మాత ఐసరి కె గణేష్, టి.శివ, ధనుంజయన్‌ తదితరులు అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.

మరిన్ని వార్తలు